నెంబర్ 1 బౌలర్ గా బూమ్రా.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ హవా

బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపింది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లందరూ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్ళారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 07:37 PM IST

బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపింది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లందరూ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్ళారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో బూమ్రా 11 వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ ను వెనక్కి నెట్టి 870 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. స్పిన్నర్ అశ్విన్ 869 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లోనూ భారత ఆటగాళ్ళ ఆధిపత్యం కొనసాగుతోంది. తాజా జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనూ భారత ఆటగాళ్ళ స్థానాలు మెరుగయ్యాయి.

రెండో టెస్టులో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ సిరీస్ లో 189 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న జైశ్వాల్ రెండు స్థానాలు ఎగబాకాడు. అటు కాన్పూర్ టెస్టులో రాణించిన విరాట్ కోహ్లీ మళ్ళీ టాప్ 10లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజా జాబితాలో ఆరు స్థానాలు మెరుగైన కోహ్లీ ఆరో ర్యాంకులో ఉన్నాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొమ్మిదో ర్యాంకులో ఉండగా… బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ 15వ ర్యాంకుకు పడిపోయాడు. కాగా టీమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లో ఉండగా… భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.