అందుకే బూమ్ బూమ్… బూమ్రా సరికొత్త చరిత్ర

  • Written By:
  • Publish Date - September 20, 2024 / 06:55 PM IST

భారత క్రికెట్ లో జస్ప్రీత్ బూమ్రా పేస్ బౌలింగ్ గురించి అందరికీ తెలిసిందే… బూమ్రా పేస్ కు ప్రత్యర్థి బ్యాటర్లు వణకాల్సిందే… టీ ట్వంటీల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన సత్తా ఉన్న పేసర్ బూమ్రానే…ఫార్మాట్ తో సంబంధం లేకుండా తనదైన పేస్ తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే బూమ్రా తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లను పూర్తి చేసుతున్నాడు. ఈ ఘనత సాధించిన భారత ఆరో ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 400 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అత్యల్ప సగటును కలిగిన రెండో ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు. బుమ్రా 21.01 సగటుతో 400 వికెట్లు పడగొట్టాడు. అగ్రస్థానంలో వెస్టిండీస్ పేసర్ జోయెల్ గార్నెర్ ఉన్నాడు.

30 ఏళ్ల ఈ స్టార్ పేసర్ టెస్టుల్లో 170 వికెట్లు, వన్డేల్లో 149, టీ20 ఫార్మాట్‌లో 89 వికెట్లు తీశాడు. బుమ్రా కంటే ముందు 400 వికెట్లను తొమ్మిది మంది భారత బౌలర్లు పూర్తి చేసుకున్నారు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ , హర్భజన్ సింగ్ , కపిల్ దేవ్ , జహీర్ ఖాన్ , రవీంద్ర జడేజా , శ్రీనాథ్, మహ్మద్ షమి , ఇషాంత్ శర్మ 400 వికెట్ల క్లబ్ లో ఉన్నారు. కాగా చెన్నై టెస్టులో బూమ్రా దెబ్బకు బంగ్లాదేశ్ 149 రన్స్ కే కుప్పకూలింది. భారత స్టార్ పేసర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు.