ఐపీఎల్ (IPL) లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న దశలో పాయింట్ల టేబుల్లో ప్రతి విజయం ఆయా టీమ్స్ స్థానాలను తారుమారు చేస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ పై విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 98 పరుగులతో గెలిచి కేకేఆర్ తమ నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపరచుకుంది.
నాలుగు వారాలుగా టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రెండో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో కేకేఆర్ (KKR) నెట్ రన్ రేట్ మాత్రం మొదటి నుంచీ ఒకటికిపైగా ఉండటం విశేషం. అందుకే పాయింట్లు రాజస్థాన్ తో సమంగా ఉన్నా…మంచి రన్ రేట్ తో అగ్రస్థానం దక్కించుకుంది.
మరో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టాప్ 4లోకి దూసుకొచ్చింది.ఈ విజయంతో సీఎస్కే 11 మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లు, 0.700 నెట్ రన్ రేట్ తో మూడో స్థానానికి వచ్చింది. సన్ రైజర్స్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లతో ఉంది. సీఎస్కేతో మ్యాచ్ లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానానికి పడిపోయింది.
ఇక ఆరు నుంచి పది స్థానాల్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ (RCB), పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ (MI) ఉన్నాయి. ప్రస్తుతం రెండు టీమ్స్ తప్ప మిగిలిన 8 జట్లు లీగ్ స్టేజ్ లో 11 మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు వారాల్లో లీగ్ స్టేజ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ నాలుగు టీమ్స్ తర్వాతి రౌండ్ కు వెళ్తాయన్నది చెప్పడం కష్టంగా మారింది. ముంబై, గుజరాత్, పంజాబ్, ఆర్సీబీలాంటి టీమ్స్ సాధించే సంచలన విజయాలు ఈసారి ప్లేఆఫ్స్ జట్లు ఏవో తేల్చనున్నాయి.