Rohit Sharma: ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేసిన టీమిండియా బృందంలో ఆరుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. ఇది చూసిన ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. కెప్టెన్‌కు నచ్చిన వాళ్లకే టీంలో చోటిస్తారా..? నచ్చకపోతే ట్యాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారా..? అంటూ మండిపడ్డారు. ఈ టీంలో ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అతనితో కలిపి ఆసియా కప్‌కు మొత్తం 18 మందిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఒక దేశం నుంచి కేవలం 15 మంది బృందాన్ని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది.
అంటే ఈ 18 మందిలో మరో ముగ్గురు ఛాన్స్ కోల్పోతారు. ఈ క్రమంలో జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా పక్షపాతం చూపిస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తాజాగా రోహిత్ వివరణ ఇచ్చాడు. ‘టీంను సెలెక్ట్ చేసే సమయంలో బెస్ట్ కాంబినేషన్లు చూస్తాం. అలాంటప్పుడు పలు కారణాల వల్ల కొందరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఛాన్స్ కోల్పోయిన వారికి ఆ కారణాలు వివరించడానికి నేను, ద్రావిడ్ భాయ్ ప్రయత్నించాం. ఇలా జట్టును సెలెక్ట్ చేసినప్పుడు, మ్యాచ్‌కు ముందు ఆడే 11 మంది టీంను ప్రకటించిన ప్రతిసారీ ప్లేయర్లతో మేం మాట్లాడుతూనే ఉన్నాం’ అని రోహిత్ వివరించాడు. ‘ఆటగాళ్లతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి, వాళ్లను ఎందుకు తీసుకోలేదో వివరించే ప్రయత్నం చేశాం. ఒక్కోసారి వాళ్ల స్థానంలో నన్ను నేను ఊహించుకుంటా.
నాకు 2011 వరల్డ్ కప్‌లో ఛాన్స్ దక్కలేదు. అది నాకు చాలా బాధాకరమైన ఫీలింగ్. వరల్డ్ కప్ మిస్ అయ్యాక ఇంక ఏముంటుందని అప్పుడు చాలా బాధ పడ్డా. ఆ సమయంలో యువరాజ్ సింగ్ నాకు అండగా నిలిచాడు’ అని గుర్తుచేసుకున్నాడు. ఇతరుల అభిప్రాయాలు వినడానికి కూడా తను సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చిన రోహిత్, తాము ఎంపిక చేసిన జట్టు కూడా విఫలం అవ్వొచ్చని, తమ సెలెక్షన్‌లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉందని కూడా నిజాయితీగా ఒప్పుకున్నాడు.