Carlos Alcaraz: గ్యాంగ్ లీడర్ కు షాక్.. గ్రాండ్ స్లామ్ గెలిచిన బుడతడు

స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 05:45 PM IST

టెన్నిస్ ప్రపంచంతో పాటు యావత్ క్రీడాభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన వింబుల్డన్ – 2023 ఫైనల్‌లో సంచలనం నమోదైంది. 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచి మరొకటి గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆశలను అడియాసలు చేస్తూ స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ లేని లోటును భర్తీ చేస్తూ ఓ కొత్త సంచలనం దూసుకొచ్చింది. ఆ సంచలనం పేరు కార్లొస్ అల్కరాస్.. ఇటీవలే 20వ పుట్టినరోజు జరుపుకున్న ఈ కుర్రాడు.. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న జకోవిచ్‌కు ఝలక్ ఇచ్చాడు. వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో 45 మ్యాచ్‌లు ఆడి ఓటమన్నదే లేని జకోకు.. ‘ఇదిగో.. ఓటమి అంటే ఇలా ఉంటుంది’ అని రుచి చూపించాడు.

కార్లొస్ అల్కరాస్ గర్ఫియా.. స్పెయిన్ దేశస్తుడు. ప్రపంచానికి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్‌ను అందించిన దేశం నుంచి వచ్చాడు. తండ్రి గొంజాలెజ్ కూడా టెన్నిస్ ఆటగాడే. నాలుగేండ్ల వయసులోనే రాకెట్ పట్టిన అల్కరాస్‌.. తన తండ్రి డైరెక్టర్‌గా ఉన్న ఓ టెన్నిస్ క్లబ్‌లోనే ఆటకు సంబంధించిన పాఠాలు నేర్చుకున్నాడు. బాలుడిగా స్పెయిన్‌లోని రియల్ సోసిడెడ్ క్లబ్‌కు ఆడిన అతడు.. 2018లో తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ విజేత జువాన్ కార్లొస్ ఫెరారో శిక్షణలో రాటుదేలాడు. 16 ఏండ్లకు టెన్నిస్‌లో ప్రఖ్యాతిగాంచిన ఏటీపీ టోర్నీలో అడుగుపెట్టాడు. 17 ఏండ్ల వయసులోనే గ్రాండ్‌స్లామ్ ఆడాడు. 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అల్కరాస్.. 18వ ఏట మ్యాడ్రిడ్ ఓపెన్ గెలిచాడు. ఈ టోర్నీలో భాగంగా చిన్నప్పట్నుంచి తాను ఎంతగానో ఆరాధించిన రఫెల్ నాదల్‌ను రెండో రౌండ్‌లోనే ఓడించాడు.

ఈ టోర్నీలో నాదల్‌తో పాటు జకోవిచ్, జ్వెరెవ్ వంటి ఆటగాళ్లను సైతం నిలువరించాడు. 2021 జులైలో క్రొయేషియా ఓపెన్ ఉమాగ్ గెలిచిన అల్కరాస్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2022 నుంచి అయితే అల్కరాస్ ఓ సంచలనంలా దూసుకొస్తున్నాడు. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో ఐదో సీడ్ కాస్పర్ రూడ్‌ను ఓడించి అతి పిన్న వయసులోనే గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్న అల్కరాస్.. సెమీఫైనల్‌లో జకోవిచ్ చేతిలో ఓడాడు. మ్యాచ్ ఓడినా అతడి పోరాటం మాత్రం అందరినీ కట్టిపడేసింది. తాజాగా వింబుల్డన్‌లో వరుసగా ఐదో ఫైనల్ ఆడుతూ.. సెంటర్ కోర్ట్‌లో అపజయమన్నదే లేని జకోవిచ్‌కు ఓటమి రుచి చూపించి కొత్త చరిత్ర లిఖించాడు.