పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న టాప్ బ్యాటర్ అతడేనని పేర్కొన్నాడు. అతడి ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని అంటున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అతడితో తొలిసారి మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ నుంచే నాకు ఇమాద్ తెలుసు. బాబర్ నాతో మాట్లాడాలని అనుకుంటున్నట్టు అతడే నాకు చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. అతడు నాతో ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడాను.
తొలిరోజు నుంచీ అతడు ఇలాగే మాట్లాడటం నాకు తెలుసు’ అని విరాట్ కోహ్లీ అన్నాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఆడుతున్న టాప్ ఆటగాడు బాబర్. అతడు చాలా నిలకడగా ఆడతాడు. అతడి ఆటను నేనెంతో ఆస్వాదిస్తాను’ అని విరాట్ వివరించాడు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ఒకర్నొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా, పాకిస్థాన్ ఎప్పుడు ఆడినా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. ఆసియాకప్‌లో భాగంగా ఈ రెండు జట్లూ మూడు మ్యాచుల్లో తలపడే అవకాశం ఉంది. లీగ్ దశలో ఒకసారి, సూపర్ 4లో మరోసారి ఆడటం ఖాయమే. అన్నీ కుదిరితే ఫైనల్ ఆడతాయి. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో తలపడతాయి.