Cheteshwar Pujara: భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. దానిని నిలుపుకోవడం అంత కన్నా కష్డం. ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుంటూ ఫామ్ కొనసాగించాలి. లేకుంటే సెలక్టర్లు పక్కన పెట్టేస్తారు. అయితే టీమిండియా వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా మాత్రం సెలక్షన్‌తో సంబంధం లేకుండా ఆడుతుంటాడని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా అతడు ముందుకు సాగుతున్న తీరు అమోఘమని ప్రశంసించాడు.
VIRAT KOHLI: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ
ఆటపై అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తి పాఠంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. గత ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే పుజారా పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 17వ డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరమని, కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసని కైఫ్ ప్రశంసించాడు. ఫామ్ కోల్పోయిన తర్వాత పుజారా.. కౌంటీల్లో, ఇప్పుడు రంజీల్లోనూ రాణించిన తీరును యువ క్రికెటర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని కైఫ్ సూచించాడు. టెస్టు స్పెష్టలిస్ట్ బ్యాటర్‌గా పుజారా రికార్డు గురించి తెలియని అభిమాని ఉండడు. రాహుల్ ద్రావిడ్ తర్వాత నయా వాల్‌గా పేరు తెచ్చురున్నాడు.
స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. బౌన్సర్లతో బౌలర్లు ఇబ్బంది పెట్టినా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో ఎన్నోసార్లు నిలబడ్డాడు. తన కెరీర్‌లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో వైఫల్యం తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో పుజారాకు చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.