Cheteshwar Pujara: శతక్కొట్టిన పుజారా.. జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడా..?

జార్ఖండ్‌తో జ‌రుగుతున్న రంజీ మ్యాచ్‌లో సెంచ‌రీతో అదరగొట్టాడు. జార్ఖండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 142 ప‌రుగుల‌కే ఆలౌటవగా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. పుజారా శతకంతో భారీస్కోరు దిశగా సాగుతోంది.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 06:59 PM IST

Cheteshwar Pujara: చటేశ్వర పుజారా.. టీమిండియా సీనియర్ క్రికెటర్. రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆ స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లకు టెస్టుల్లో సవాల్‌గా మారిన ఆటగాడు. అతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు విజయంపై ఆశలు వదువుకోవాల్సిందే. ఎన్నోసార్లు టెస్ట్ క్రికెట్‌లో భారత్‌ ఓటమికి అడ్డుగోడలా నిలబడ్డాడు. అయితే గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన పుజారా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. దీనిలో భాగంగా కౌంటీల్లోనూ ఆడిన పుజారా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు.

DAVID WARNER: హాఫ్ సెంచరీతో కెరీర్‌కు గుడ్ బై.. చివరి మ్యాచ్ ఆడేసిన వార్నర్..

జార్ఖండ్‌తో జ‌రుగుతున్న రంజీ మ్యాచ్‌లో సెంచ‌రీతో అదరగొట్టాడు. జార్ఖండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 142 ప‌రుగుల‌కే ఆలౌటవగా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. పుజారా శతకంతో భారీస్కోరు దిశగా సాగుతోంది. పుజారా 162 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజ‌రాకు ఇది 61వ శ‌త‌కం. పుజారా తాజా ఇన్నింగ్స్‌తో సెలక్టర్లకు గట్టి మేసేజే పంపించాడని చెప్పొచ్చు. 2023లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఈ మ్యాచులోనూ విఫ‌లం కావ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయాడు. దీనికి తోడు పలువురు యువ క్రికెటర్లు పోటీనిస్తుండడంతో సెలక్టర్లు అతన్ని పక్కన పెట్టారు.

పుజారా ఇప్పటి వరకూ 103 టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలతో 7195 పరుగులు చేశాడు. జ‌న‌వ‌రి 25 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ కోసం జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. సొంతగడ్డపై జరగనున్న ఈ సిరీస్‌లో పుజారాకు చోటు దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించేందుకు చివరి సీరీస్ గా ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.