ధోనీ మోసం చేశాడు.. బీసీసీఐకి అమేథి వాసి ఫిర్యాదు

  • Written By:
  • Updated On - August 12, 2024 / 03:16 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోనీ తనను 15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. దాంతో బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొని ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని ఆదేశించింది. మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఒప్పందం విషయంలో విబేధాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ధోనీ కోర్టును ఆశ్రయించాడు.

దాదాపు 15 కోట్ల మేర తనకు టోకరా వేశారని, ఆర్కా స్పోర్ట్స్ సంస్థ యజమాని సౌమ్యా దాస్‌పై ధోనీ రాంచీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా ఆ సంస్థకే చెందిన రాజేశ్ కుమార్ ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. తాజాగా బీసీసీఐ వివరణ కోరిన నేపథ్యంలో ధోనీ స్పందిస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వేలంలో ధోనీని రిటైన్ చేసుకునేందుకు చెన్నై ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ వెల్లడైన తర్వాత గానీ ధోనీ ఫ్యూచర్ పై క్లారిటీ వచ్చేలా లేదు.