WORLD CUP 2023: మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతం. అంతకుమించి పిచ్చి. అలాంటిది ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతోందంటే ఆ సందడి ఎలా ఉండాలి..? ప్రేక్షకుల స్పందన ఉప్పొంగాలి. కానీ, ఇప్పటికైతే ఆ సందడి కనిపించడం లేదు. వరల్డ్ కప్ ప్రారంభమై మూడు రోజులు కావొస్తున్నా.. ప్రేక్షకుల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఎంతోకాలంగా ఎదురు చూసిన వరల్డ్ కప్ ప్రారంభమవుతోందంటేనే క్రికెట్ ప్రేమికులైన భారతీయ ప్రేక్షకుల్లో అనూహ్య స్పందన వస్తుందనుకున్నారు. కానీ, గురువారం జరిగిన ప్రారంభ మ్యాచులో కూడా ఆ సందడి కనిపించలేదు. అసలు.. స్టేడియంలో ప్రేక్షకులే కరువయ్యారు. దీనంతటికీ కారణం.. బీసీసీఐ వైఖరే కారణమంటున్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులే కరువయ్యారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులు లేక.. వెలవెలబోయింది. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అంటే ప్రేక్షకులు పోటెత్తుతారని, వారి ఈలలు, గోలలు, ఆనందోత్సాహాల మధ్య మ్యాచ్ జరుగుతుందని అంతా భావించారు. తీరా చూస్తే ఏదో గల్లీ మ్యాచ్‌లాగా సాగింది. మొదటి మ్యాచ్ మాత్రమే కాదు.. మరుసటి రోజు.. అంటే శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రేక్షకులు లేరు. స్టేడియం అంతా ఖాళీగానే కనిపించింది. ఈ రోజు జరిగిన రెండు మ్యాచులకు కూడా ప్రేక్షకులు తక్కువ సంఖ్యలోనే వచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసిన మ్యాచులు చప్పగా సాగుతున్నాయంటున్నారు ప్రేక్షకులు.
బీసీసీఐ వైఖరే కారణం..
ప్రేక్షకులు లేకపోవడానికి బీసీసీఐ వైఖరే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఇండియాలో టోర్నీ జరుగుతుంటే.. ఎంతో ఘనంగా ప్రారంభ వేడుకలు నిర్వహించాల్సింది. టోర్నీకి విపరీత ప్రాచుర్యం కల్సించాల్సింది. కానీ, ఈ దిశగా బీసీసీఐ పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. ఎలాంటి ప్రారంభ వేడుకలు లేకుండానో టోర్నీని ప్రారంభించింది. ఏదో గల్లీ టోర్నీలాగా. ప్రారంభ వేడుకలు అదిరిపోయేలా నిర్వహిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. కానీ, బీసీసీఐ ఈ పని చేయలేదు. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజులముందే కార్పొరేట్ ఈవెంట్స్, అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సింది. కొత్త వ్యూహాలు అమలు చేయాల్సింది. కానీ, ఈ విషయంలో కూడా బీసీసీఐకి ఆసక్తి కొరవడింది. తూతూమంత్రంగా ప్రచారం నిర్వహించి ఊరుకుంది.
దీంతో టోర్నీపై ప్రజలకు, ప్రేక్షకులకు, కార్పొరేట్లకు కూడా సరైన ఆసక్తి లేకుండా పోయింది. ఇదంతా సరే.. కనీసం ప్రేక్షకుల్ని స్టేడియం వరకు కూడా రప్పించలేకపోతే ఎలా..? ఇండియా మ్యాచులకు మాత్రమే ప్రేక్షకులు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. అందులోనూ ఇండియా-పాక్ మ్యాచ్ టిక్కెట్లు దొరకడం కష్టమైపోయింది. ఈ మ్యాచులకు స్టేడియాలు ప్రేక్షకులతో హోరెత్తడం ఖాయం. కానీ, మిగతా దేశాల మధ్య జరుగుతున్న మ్యాచుల సంగతేంటి..? జనాలకు ఆసక్తి లేదనే సంగతి తెలుసుకదా..? ఇలాంటప్పుడు టిక్కెట్ల ధరలు తగ్గించడం.. కార్పొరేట్ సంస్థలకు గంపగుత్తగా టిక్కెట్లు చవకగా ఇచ్చేయడం.. విద్యార్థులకు ఉచితంగా అందజేయడం.. వివిధ రంగాల వారికి టిక్కెట్లు అందజేస్తే స్థానిక ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. వాళ్లంతా స్టేడియానికి వచ్చి మ్యాచులు చూస్తారు. కానీ, ఈ ప్రయత్నం కూడా బీసీసీఐ చేయడంలేదు. కనీసం మ్యాచులకు స్టేడియం నిండా ప్రేక్షకులు ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా లేకుండా బీసీసీఐ ప్రవర్తిస్తోంది.
బిజినెస్ సంగతేంటి..?
టోర్నీ నిర్వహణ ద్వారా దేశానికి బోలెడంత ఆదాయం. ఇప్పటికే ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు విమాన, రైలు టిక్కెట్లు, హోటల్స్ బుక్ చేసుకున్నారు. ఇలాగే అన్ని మ్యాచులకు జరిగితే టూరిజం, రవాణాసహా వివిధ రంగాలకు ఆదాయం. కానీ, బీసీసీఐ తీరు వల్ల ప్రపంచ కప్‌తో భారీ వ్యాపారం జరిగే అవకాశం లేదు. ఇది ఆదాయానికి గండికొట్టే ఛాన్స్ ఉంది. గత ఏడాది జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఎంతటి ప్రాధాన్యం దక్కించుకుందో తెలిసిందే. ఈ టోర్నీ కోసం ఖతార్‌కు జనం పోటెత్తారు. ప్రతి మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి, ప్రపంచం నుంచి అనూహ్య స్పందన లభించింది. కానీ, మన దేశంలో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ విషయంలో మాత్రం ఆ స్థాయి స్పందన కనిపించడం లేదు. ఇకనైనా బీసీసీఐ మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. ప్రపంచ కప్ కళ తప్పుతుంది.