Cricket World Cup: క్రికెట్ పండుగకు వేళాయె.. కప్పు ఎవరిదైనా.. వినోదం మాత్రం ప్రేక్షకుడిదే..!

దేశంలో క్రికెట్ పేరుతో, క్రికెట్ చుట్టూ జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది క్రికెట్ వల్ల. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐదే. ఇతర దేశాల రిచెస్ట్ క్రీడా సంస్థల్లో కూడా బీసీసీఐ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 08:25 PM IST

Cricket World Cup; క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గురువారం ప్రారంభం కాబోతుంది. ఇండియా వేదికగా జరగనున్న ఈ టోర్నీకి సర్వం సిద్ధమైంది. 40 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీ క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించనుంది. ఈసారి కూడా టీమిండియా ఎప్పట్లాగే ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కప్పు ఎవరు గెలిచినా.. ఓడినా.. ప్రేక్షకులకు మాత్రం వినోదం గ్యారెంటీ. అంతకుమించి వేల కోట్ల వ్యాపారానికి వరల్డ్ కప్ వేదికకానుంది.
ఇండియాలో క్రికెట్ కూడా ఒక మతమే. దేశంలో అత్యధికమంది ఇష్టపడే ఆట. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. క్రికెట్‌కు ఫ్యాన్స్ ఉంటారు. అందుకే మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణను మాటల్లో చెప్పలేం. ఇంత ఆదరణ ఉంది కాబట్టే.. దేశంలో క్రికెట్ పేరుతో, క్రికెట్ చుట్టూ జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది క్రికెట్ వల్ల. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐదే. ఇతర దేశాల రిచెస్ట్ క్రీడా సంస్థల్లో కూడా బీసీసీఐ ఉంటుంది. అలాంటి బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టోర్నీ కూడా వేల కోట్ల వ్యాపారం చేయబోతుంది. మ్యాచుల ప్రసార హక్కులకే వేల కోట్ల డిమాండ్ ఉంది. శాటిలైట్, ఓటీటీ ప్రసార హక్కులతోపాటు.. ప్రచార హక్కుల ద్వారా ఐసీసీకీ, బీసీసీఐకి, వివిధ దేశాల బోర్డులకు కాసుల వర్షం కురుస్తుంది. అందులోనూ ఇండియాలో టోర్నీ కాబట్టి.. ఆదాయానికి లోటుండదు. బ్రాండింగ్ హక్కుల ధరలే వందల కోట్ల రూపాయలు ఉంటాయి. క్రికెట్ ప్లేయర్స్ చిన్న ప్రచారం చేసినా.. అకౌంట్లలో కోట్ల రూపాయలు వచ్చి చేరడం ఖాయం. ప్రత్యక్షంగా బోర్డులు, ఆటగాళ్లకు వచ్చే ఆదాయమే కాదు.. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా ఇతరత్రా ఆదాయం కూడా సమకూరుతుంది. క్రీడాకారులు, ప్రేక్షకుల రవాణా, హోటళ్లు, టూరిస్టుల ద్వారా దేశానికీ బోలెడంత ఆదాయం. అందుకే వరల్డ్ కప్ టోర్నీతో ఇండియాలో కాసుల పంట పండటం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రేక్షకుడికి వినోదం..
ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వినోద సాధనాలు రెండే. ఒకటి సినిమా.. రెండు క్రికెట్. అలాంటిది క్రికెట్ వరల్డ్ కప్ అంటే భారతీయులకు మామూలు వినోదం కాదు. ముఖ్యంగా ఇండియా మ్యాచులు జరిగే రోజు జనాలంతా సొంత పనులు పక్కనబెట్టి మరీ టీవీలు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతారు. మ్యాచులు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వబోతున్నాయి. వివిధ హోటళ్లు, క్లబ్బులు, సముదాయాలు వరల్డ్ కప్ స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి. వీటి ద్వారా ఆయా సంస్థలకు ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఈ నెల 5న మొదలయ్యే వరల్డ్ కప్.. నవంబర్ 19 వరకు జరగనుంది.