ఈ సిరీస్ లో ఆడిన మూడు వన్డేల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్న సూర్య.. చివరి వన్డేలో ఆగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఏ ఆటగాడూ కోరుకోని చెత్త రికార్డును సాధించాడు. వరుస వైఫల్యాలతో సూర్యకుమార్ బలహీనతలపైనా చర్చ మొదలైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడే ఈ స్టార్ బ్యాటర్ మూడో వన్డేలో అదే వీక్ నెస్ తో ఔటయ్యాడు. అంతకుముందు రెండు వన్డేల్లోనూ స్టార్క్ వేసిన ఇన్ స్వింగర్లను ఎదుర్కోలేక వికెట్ల ముందు దొరికిపోయాడు.
వరుసగా మూడు డకౌట్ల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కురుస్తోంది. ఐపీఎల్, టీ20 ఫార్మాట్ తప్ప మిగతా ఫార్మాట్లకు అనవసరమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫేక్ 360 అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే వన్డేల్లో సూర్యకి అసలు అనుభవంలేదని, అందుకే కుదురుకునేందుకు అవకాశాలు ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూర్యకుమార్ ను వెనకేసుకొచ్చాడు. అతను మూడు బంతులే ఆడాడని, అప్పుడే వన్డేల్లో అతని ఆటతీరును అంచనా వేయలేమన్నాడు. నిజానికి టీ ట్వంటీ ఫార్మాట్ లో మాత్రం దుమ్మురేపే సూర్యకుమార్ వన్డేల్లో ఆడడంపై సరిగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. వన్డేల్లో కాస్త ఓపికతో ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మ్యాచ్ లో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించకుండా.. టీ ట్వంటీ తరహాలో ఆడేస్తే వికెట్ పారేసుకోవడం తప్ప ఇంకేమీ జరగదు. ఇవన్నీ సూర్యకుమార్ కు తెలియనివి కావు.. అయితే టీ ట్వంటీలకు బాగా అలవాటు పడి ఇవన్నీ మరిచిపోయాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ కంటే ముందే సూర్య తన బలహీనతలు అధిగమించకుంటే వన్డే జట్టులో చోటు ఆశించడం కష్టమే.