ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్ ఫోర్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.
ఈ విమర్శలపై రియాక్ట్ అయిన గౌతం గంభీర్ వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారని ప్రశ్నించాడు. తనకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదన్నాడు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవన్నాడు. ఇక ఏబీడీ ఐపీఎల్‌లో వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.అయితే హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అని గుర్తు చేశాడు. ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదంటూ గంభీర్ అభిప్రాయ పడ్డాడు.