ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు వేలంలో ప్యాట్ కమ్మిన్స్ ను 20.5 కోట్లు పెట్టి కొన్నప్పుడు అంత ఇవ్వడం అవసరమా అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే సీజన్ మొదలయ్యాక మాత్రం సరైన ప్లేయర్ కోసం సరిగ్గానే ఖర్చు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కమ్మిన్స్ జట్టు పగ్గాలు అందుకున్నాక సన్ రైజర్స్ హైదరాబాద్ ను సక్సెస్ ఫుల్ గా ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. దాంతో ఈసారి కప్ కచ్చితంగా సన్ రైజర్స్ ఎగరేసుకుపోతుందని ఫ్యాన్స్ బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ అంత గట్టిగా చెప్పడానికి కారణం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గణాంకాలే.
సారథిగా కమ్మిన్స్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. అతడు కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న తర్వాత ఆసీస్ కు మెగాట్రోఫీలను అందిస్తూ వస్తున్నాడు. గతేడాది నుంచి కమ్మిన్స్ పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ప్యాట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాషెస్ సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ 2023 లాంటి మెగా ట్రోఫీలను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గానూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి ఐపీఎల్ టైటిల్ సన్ రైజర్స్ దేనని ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ ఆసీస్ స్టార్ కెప్టెన్ హైదరాబాద్ కు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి.