David Warner: సచిన్ రికార్డులు బద్దలు.. వరల్డ్ కప్ ముందు వాయిస్తున్నాడు..!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకంతో చెలరేగాడు. చాలా రోజుల నుంచి పెద్దగా ఫామ్‌లో లేని వార్నర్ సరిగ్గా ప్రపంచకప్ ముందు సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 93 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:41 PM IST

David Warner: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా జోరు ప్రదర్శిస్తోంది. తొలి రెండు వన్డేల్లోనూ విజయాలను సాధించి సిరీస్ పట్టేయడానికి చేరువైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకంతో చెలరేగాడు. చాలా రోజుల నుంచి పెద్దగా ఫామ్‌లో లేని వార్నర్ సరిగ్గా ప్రపంచకప్ ముందు సెంచరీతో ఫామ్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో వార్నర్ 93 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో వార్నర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్ గా 45 సెంచరీలను చేశాడు. ఒక ఓపెనర్ రికార్డుల్లో అత్యధిక సెంచరీలు ఇవే. అయితే తాజాగా వార్నర్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్ గా 46వ సెంచరీని అందుకున్నాడు.

వన్డేల్లో 20, టెస్టుల్లో 25, టి20ల్లో ఒక సెంచరీని వార్నర్ ఓపెనర్ గా సాధించాడు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో మాత్రమే ఓపెనర్‌గా ఉన్నాడు. ఇక టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. అందులో నాలుగు సెంచరీలను మిడిలార్డర్‌లో సాధించాడు.