ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది. దాదాపు స్టార్ ప్లేయర్స్ అందరూ ఈ సారి వేలంలోకి రానున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలతో బీసీసీఐ మీటింగ్ కూడా జరిగింది. అయితే రిటెన్షన్ రూల్స్ , ఇతర నిబంధనలపై మాత్రం క్లారిటీ రాలేదు. మరోవైపు మెగా వేలం ఈ సారి విదేశాల్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దుబాయ్ వేదికగా ఒకసారి ఆటగాళ్ళ వేలం నిర్వహించారు. ఈ సారి కూడా విదేశాల్లోనే వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం. మెగావేలం ఆతిథ్య రేసులో యూఏఈ ముందుంది. దుబాయ్ , దోహా , సౌదీఅరేబియా పేర్లు వినిపిస్తున్నాయి.
స్వదేశంలోనే ఈ సారి ఆక్షన్ జరుగుతుందని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో బీసీసీఐ విదేశాల వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఐపీఎల్ వేలం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిటెన్షన్ రూల్స్ పై ఇంకా స్పష్టత లేదు. గతంలోలాగానే నలుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. అలాగే రైట్ టూ మ్యాచ్ ఆప్షన్, ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల పైనా మరో రెండు వారాల్లో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.