అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీ ? చెన్నై రిటెన్షన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ మెగావేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ ఛాన్స్ ఉండగా.. ఈ సారి బీసీసీఐ ఆరుగురికి అవకాశమిచ్చింది.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 06:15 PM IST

ఐపీఎల్ మెగావేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ ఛాన్స్ ఉండగా.. ఈ సారి బీసీసీఐ ఆరుగురికి అవకాశమిచ్చింది. దీంతో ఖుషీగా ఉన్న ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని చెన్నై అన్ క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 4 కోట్లకే ధోనీని సొంతం చేసుకునేందుకు వీలుగా బీసీసీఐ కూడా రూల్ తీసుకురావడంతో చెన్నై రెడీగానే ఉంది. అయితే ధోనీ ప్లేయర్ గా ఉంటాడా లేదా అన్నది అతనే చెప్పాల్సి ఉందంటూ చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా చెన్నై రిటెన్షన్ జాబితాలో ధోనీ పేరు ఉండడం ఖాయమే.

మిగిలిన రిటైన్ జాబితాను చూస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను రిటైన్ చేసుకోనుంది. ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న రుతురాజ్ జట్టును పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ గా నడపించలేకపోయినా అతనిపై మేనేజ్ మెంట్ కు నమ్మకం పోలేదు. ఓపెనర్ గా 14 మ్యాచ్ లలో 500కు పైగా రన్స్ చేసిన రుతురాజ్ చెన్నై జట్టుతో పాటే కొనసాగనున్నాడు. అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను కూడా చెన్నై రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక విదేశీ ఆటగాళ్ళలో రచిన్ రవీంద్రతో పాటు ఫాస్ట్ బౌలర్ మహేశ్ పతిరణను చెన్నై కొనసాగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మలింగా స్టైల్ లో బౌలింగ్ చేసే పతిరణ గత సీజన్ లో అదరగొట్టాడు. ధోనీతో పాటు గతంలో చెన్నైకి ఆడిన పలువురు యువ ఆటగాళ్ళను కూడా సీఎస్కే వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది.