ముంబై ఇండియన్స్ తో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీ యాజమాన్యం తీరుపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ ముంబైని వీడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్ కు ముందు ట్రేడింగ్ ద్వారా హార్థిక్ పాండ్యాను తీసుకొచ్చిన ముంబై ఇండియన్స్ రోహిత్ ను తప్పించి అతనికి పగ్గాలు అప్పగించింది. దీనిపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు స్టేడియంలో సైతం హార్థిక్ ను ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలోనూ తీవ్రనిరసన తెలిపారు. దీనికి తోడు ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా రోహిత్ ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరు సరిగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముంబై రిటైన్ జాబితాలో రోహిత్ పేరు ఉండే అవకాశం లేదని కూడా అర్థమవుతోంది.
ఇప్పుడు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబైకి హిట్ మ్యాన్ గుడ్ బై చెబుతాడని భావిస్తున్నారు. రోహిత్ వేలంలోకి వస్తే ఎంతైనా బిడ్ వేసి కొనేందుకు రెండు, మూడు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ వేలంలోకి వచ్చే అవకాశం లేదని సమాచారం. అతను ట్రేడింగ్ ద్వారానే మరో జట్టుకు వెళతాడని తెలుస్తోంది. ట్రేడింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ రోహిత్ ను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐపీఎల్ వర్గాల చెబుతున్నాయి.