గబ్బా పిచ్ పై మొదట ఫీల్డింగ్, రోహిత్ తప్పు చేశాడా ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. తొలిరోజు వర్షం అడ్డంకిగా నిలవడంతో కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే భారీ వర్షం రావడంతో ఆటను రద్దు చేయక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 03:30 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. తొలిరోజు వర్షం అడ్డంకిగా నిలవడంతో కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే భారీ వర్షం రావడంతో ఆటను రద్దు చేయక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు విదేశీ మాజీ ఆటగాళ్ళు రోహిత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అటు భారత స్టార్ పేసర్ బూమ్రా సైతం పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బూమ్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గబ్బా పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించలేదు. టీమిండియా బౌలర్లు 13.2 ఓవర్లు వేసినా ఒక్క వికెట్‌ తీయలేకపోయారు. బ్రిస్బేన్‌లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు పిచ్‌పై గడ్డి ఉండడంతో బౌలింగ్అ కు అనుకూలంగా ఉంటుందని భావించారు.

అయితే, బుమ్రా, సిరాజ్‌ విసిరిన బంతులు ఏమాత్రం స్వింగ్‌ కాకపోవడంతో బౌలర్లు కాస్త నిరాశకు గురయ్యారు. బంతి స్వింగ్‌ అవడం లేదని బుమ్రా చెప్పిన మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ఇదిలా ఉంటే రోహిత్‌ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్‌ నిర్ణయం ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు సంతోషాన్నిచ్చి ఉంటుందన్నాడు. తాను టాస్‌ ఓడిపోయినందుకు కమ్మిన్స్ ఖచ్చితంగా సంతోషపడి ఉంటాడన్నాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడనీ, ఏదేమైనా రోహిత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని తప్పుచేశాడని మైకేల్‌ వాన్‌ వ్యాఖ్యానించాడు. కానీ టాస్ గెలిచి ఉంటే తాను కూడా బౌలింగ్ తీసుకునేవాడినంటూ టాస్ సమయంలో కమ్మిన్స్ చెప్పడం ఆశ్చర్యపరిచింది.