Disney Hotstar: భారత టెలి కమ్యూనికేషన్ రంగంలో రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రీగా ప్రజలకు చేరువైన జియో నెట్‌వర్క్ ఇప్పుడు వ్యసనంగా మారిపోయింది. తామే అగ్రస్థానంలో ఉన్నామని విర్రవీగుతున్న కొన్ని సంస్థలను దెబ్బ కొట్టి జియో టాప్ లేపింది. దీంతో ఎంతో మంది యూజర్లు జియోకు మారిపోయారు. నెమ్మదిగా అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్న రిలయన్స్.. ఓటీటీ రంగంలోకి కూడా ప్రవేశించింది. ముందుగా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ చేజిక్కించుకొని మరోసారి ఫ్రీగా క్రీడా అభిమానులకు చేరువైంది.
జియో సినిమా యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేటి క్రీడా ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాలను నయాపైస లేకుండా ఉచితంగా అందిస్తోంది. భారత్‌లో క్రికెట్ కోట్లు కురిపించే క్రీడ. ఇప్పటికే ఫ్రాంచైజీ క్రికెట్‌తో క్రికెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన రిలయన్స్.. బ్రాడ్ కాస్టింగ్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. భారీ ధరకు ఐపీఎల్ ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. భారత్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌తో పాటు బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రసారాలను జియోసినిమా ఉచితంగా అందించడంతో.. ఇప్పటి వరకు తమకు పోటే లేదని విర్రవీగిన డిస్నీ హాట్‌స్టార్ దిగొచ్చింది. జియో సినిమా దెబ్బకు ఆసియా కప్ 2023తో పాటు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ఉచితంగా అందించేందుకు సిద్దమైంది.
ఆసియా కప్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేసింది. ఇక రిలయన్స్ సంస్థ పోటీని తట్టుకోలేకపోతున్న స్టార్ నెట్ వర్క్.. డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్‌కు అమ్ముకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై రిలయన్స్ సంస్థతో డిస్నీ నెట్‌వర్క్ ప్రాథమిక చర్చలు జరిపినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో స్టార్ నెట్‌వర్క్‌పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అంబానీ దెబ్బకు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తట్టా బుట్టా సర్దుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.