Disney Plus Hotstar: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగా ఆసియా కప్, వరల్డ్ కప్ స్ట్రీమింగ్.. కానీ, ఓ కండిషన్!

క్రికెట్ మ్యాచుల్ని ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌. రాబోయే ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రకటించింది. అయితే.. ఒక కండిషన్ విధించింది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 04:58 PM IST

Disney Plus Hotstar: జియో సినిమా ఎఫెక్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై గట్టిగా పడినట్లుంది. దీంతో క్రికెట్ మ్యాచుల్ని ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రకటించింది. అయితే.. ఒక కండిషన్ విధించింది. మొబైల్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఉచితంగా వీక్షించే వెసలుబాటు కల్పించనుంది.
గత ఏడాది వరకు ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ దక్కించుకుంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే మ్యాచులు చూసే అవకాశం ఉండేది. పైగా కొన్ని ప్లాన్లకు ఒక్క డివైజ్‌పై మాత్రమే మ్యాచ్ చూసే వీలుండేది. దీంతో వ్యూయర్‌షిప్ కాస్త తక్కువగా వచ్చేది. ఈ ఏడాది నుంచి ఐపీఎల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకుంది.

ఈ ప్లాట్‌ఫామ్‌పై ఉచితంగానే మ్యాచులు చూసే అవకాశం కల్పించింది. దీంతో ప్రతి ఒక్కరూ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో ఉచితంగా మ్యాచులు చూశారు. ఈ కారణంతో జియో సినిమాకు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్ దక్కింది. గత రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచులకు అత్యధికంగా 44.9 కోట్ల వ్యూయర్‌షిప్ దక్కిందంటే ఉచిత స్ట్రీమింగ్ పథకం ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఫైనల్ మ్యాచునే 3.2 కోట్ల మంది చూశారు. దీనివల్ల జియో సినిమా భారీ లాభాలు ఆర్జించింది. జియో సినిమా అందించిన ఉచిత స్ట్రీమింగ్ సర్వీస్ సక్సెస్ కావడంతో ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కూడా ఇదే బాట పట్టనుంది.
ఉచితంగా మ్యాచుల స్ట్రీమింగ్
అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి రెండు కీలక టోర్నీలు జరగబోతున్నాయి. అది ఒకటి ఆసియా కప్.. రెండోది ఐసీసీ వరల్డ్ కప్. ఆసియా కప్ ఇండియాతోపాటు పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే, పాక్ వెళ్లేందుకు ఇండియా ఇష్టపడకపోవడం.. ఇండియా రావడానికి పాక్ సిద్ధంగా లేకపోవడంతో టోర్నీ వేదిక మారనుంది. ఐసీసీ వరల్డ్ కప్ పూర్తిగా ఇండియాలోనే జరుగుతుంది. ఆసియా కప్ సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఇందులో మొత్తం 13 మ్యాచులు ఉంటాయి. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభమై, నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. పది దేశాల్లో పాల్గొనే ప్రపంచ కప్‌లో మొత్తం 48 మ్యాచులు జరుగుతాయి. ఈ రెండింట్లోనూ ఇండియా కీలకం కాబట్టి, ఇండియాలో వీటికి భారీ ఆదరణ ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ భావిస్తోంది. వీటి స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న సంస్థ ఉచితంగానే స్ట్రీమింగ్ చేయాలనుకుంటోంది. అయితే మొబైల్ ఫోన్లలో మాత్రమే ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తుంది. మిగతా డివైజెస్‌పై క్రికెట్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకోవాల్సిందే. దేశంలోని ప్రతి మొబైల్ వినియోగదారుడికి క్రికెట్ ఉచితంగా చూసే అవకాశం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ హెడ్ సాజిత్ శివనందన్ వెల్లడించారు. మన దేశంలో 54 కోట్లకుపైగా మొబైల్ యూజర్లు ఉన్నారు. వీళ్లంతా ఉచితంగా మ్యాచులు చూస్తే జియో సినిమా రికార్డులు కూడా బద్ధలవడం ఖాయం.
సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
ఈ ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కుల్ని కోల్పోవడం కారణంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ భారీ స్థాయిలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం తగ్గింది. అయితే, ఐపీఎల్ ముగిసిన తర్వాత నుంచి తమ సబ్‌స్క్రైబర్లు నెమ్మదిగా పెరుగుతున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.