క్రేజ్ ఉంటే కాదేదీ బ్రాండింగ్ కు అనర్హం అంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు.. భారత స్టార్ క్రికెటర్లకు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఫాలోయింగ్ ఉంటుంది. సచిన్, కోహ్లీ, రోహిత్ వంటి వారిని విదేశీ క్రికెట్ ఫ్యాన్స్ సైతం అభిమానిస్తుంటారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ బడా కంపెనీలు చూస్తుంటాయి. వారితో బ్రాండింగ్ ప్రమోషన్స్ డీల్స్ చేసుకుంటుంటాయి. అయితే ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా వదలవు. దీనిలో భాగంగానే క్రికెటర్లు వాడే బ్యాట్ పైనా తమ కంపెనీ పేరును ప్రమోట్ చేసుకునేందుకు భారీ మొత్తాలనే చెల్లిస్తున్నాయి. ఈ డీల్స్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కోహ్లీ వాడే బ్యాట్ పై తమ కంపెనీ స్టిక్కర్ వేసుకున్నందుకు ప్రముఖ టైర్ల కంపెనీ ఏడాదికి 12.5 కోట్లు చెల్లిస్తోంది. 2025 వరకూ 100 కోట్లతో గతంలోనే ఒప్పందం చేసుకుంది. ప్రపంచ క్రికెట్ లో మరే ఆటగాడికీ ఈ స్థాయిలో ఒప్పందం లేదు.
కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాట్ పై స్టిక్కర్ ప్రమోషన్ తో అత్యధిక ఆదాయం లభిస్తోంది. రోహిత్ కు సియెట్ కంపెనీ ఏడాదికి 4 కోట్ల వరకూ చెల్లిస్తోంది. అలాగే యువ ఓపెనర్ శుభమన్ గిల్ కు కూడా అదే స్థాయిలో ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఎస్ జీ కంపెనీ కూడా పెద్ద మొత్తమే చెల్లిస్తోంది. ఏడాదికి 3 కోట్ల పైనే డీల్ చేసుకున్నట్టు సమాచారం. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా క్రేజ్ తగ్గని మహేంద్రసింగ్ ధోనీ కూడా బ్యాట్ తో కూడా భారీ మొత్తాన్నే ఆర్జించాడు. విదేశీ క్రికెటర్లలో డేవిడ్ వార్నర్, జో రూట్, బాబర్ ఆజామ్ వంటి ప్లేయర్స్ కూడా ఈ డీల్స్ ద్వారా కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు. కాగా క్రికెటర్లకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ , బ్రాండ్ వాల్యూ ద్వారా ఆయా కంపెనీలు కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.