ఇంగ్లాండ్ టీమ్ లో భారత బౌలర్ కొడుకు ఎవరో తెలుసా ?

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 01:43 PM IST

టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ గుర్తున్నాడా…2007 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించిన ఆర్పీ సింగ్ త‌న పేస్ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అనేక సార్లు అద‌ర‌గొట్టాడు. ఆరేళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడిన ఈ పేసర్ ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ కు కూడా ప్రాతినిథ్యం వ‌హించాడు. టీమిండియా త‌ర‌ఫున‌ మొత్తం 58 వ‌న్డేలు, 14 టెస్టులు ఆడాడు. యువ క్రికెట‌ర్ల‌తో పోటీ కార‌ణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన ఆర్‌పీ సింగ్ ఆ త‌ర్వాత కౌంటీ క్రికెట్‌కు ప్రాధాన్య‌త‌మిచ్చి ఇంగ్లాండ్ లో సెటిల‌య్యాడు. అతని కొడుకు హ్యారీ సింగ్ అక్క‌డే జ‌న్మించాడు. తండ్రి బాట‌లోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న హ్యారీసింగ్ నాలుగేళ్ల వ‌య‌సు నుంచే లంక్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు.

తాజాగా హ్యారీ సింగ్ ఇంగ్లండ్ టీమ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక‌, ఇంగ్లండ్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ మొద‌టిరోజు హ్యారీ బ్రూక్ స్థానంలో హ్యారీ సింగ్ స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌గా మైదానంలోకి దిగాడు. కొద్ది సేపు ఫీల్డింగ్ చేశాడు. అత‌డి ఫొటోలు, వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. హ్యారీ సింగ్ లంక్‌షైర్ టీమ్ త‌ర‌ఫున ప‌లు వ‌న్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కౌంటీల్లో బ్యాట‌ర్, బౌల‌ర్‌గా ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు.