ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ ట్వంటీల్లో బౌలర్లపై రసెల్ ఊచకోత సాధారణమే. కానీ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఓ సంఘటన రసెల్‌కు కోపం తెప్పించింది. స్పెన్సర్ జాన్సన్ వేసిన రాకాసి బంతి రసెల్ ఎడమచేతికి బలంగా తాకింది. దాంతో క్రీజులోనే అతడు కిందపడిపోయాడు. తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆఖరి ఓవర్ వరకు ఇదే విధ్వంసం కొనసాగించాడు.
ఆరంభంలోనే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ ను రస్సెల్, రూథర్ ఫర్డ్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 19వ ఓవర్లో అయితే రస్సెల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. జంపా బౌలింగ్ లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. రసెల్ దాడికి జంపా నాలుగు ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. రస్సెల్ జోరుతో విండీస్ 220 పరుగులు చేయగా… ఆస్ట్రేలియా 183 పరుగులే చేయగలింది.