Westindies: అంత షో వద్దు తమ్ముళ్లూ.. ‘దేశం కోసం’ అనే మాట పెద్ద బోగస్.. డబ్బులు ఇవ్వకపోతే ఆస్ట్రేలియా అయినా అస్సామే!

1983 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై ఓటమి తర్వాత విండీస్‌ క్రమక్రమంగా ఆటపై పట్టు కోల్పోతూ వచ్చింది. అయినా ఆ జట్టును తర్వాతి కాలంలో ముందుండి నడిపించిన లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. అలా వ్యక్తిగత ప్రదర్శనలతో ఆధారపడుతూ వచ్చిన వెస్టిండీస్‌ ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌కి క్వాలిఫై అవ్వలేని స్టేజీకి ఎందుకు వచ్చింది..?

  • Written By:
  • Publish Date - July 2, 2023 / 12:51 PM IST

Westindies: ప్రపంచ కప్‌ హిస్టరీలో ఇదే తొలిసారి! వరల్డ్ కప్‌కి వెస్టిండీస్‌ అర్హత సాధించకపోవడంపై అన్నీ వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కానీ.. జట్టు పతనానికి అసలు కారణాలు మాత్రం ఎవరూ చెప్పడంలేదు.
ఒకప్పుడు క్రికెట్ అంటే వెస్టిండీస్‌.. వెస్టిండీస్‌ అంటే క్రికెట్..! వాళ్లపై ఆడాలంటే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు కూడా వణికిపోయేవి. అరవీర భయంకర బ్యాటర్లతో పాటు 6అడుగుల ఎత్తు నుంచి సూపర్‌ ఫాస్ట్‌తో బౌలింగ్‌ వేసే హేమాహేమీలు వెస్టిండీస్‌ జట్టు సొంతం. అందుకే 1960, 70 దశకాల్లో వెస్టిండీస్‌.. ప్రపంచ క్రికెట్‌ని ఏలింది. 1975, 1979లో జరిగిన తొలి రెండు ప్రపంచ కప్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 1983 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై ఓటమి తర్వాత విండీస్‌ క్రమక్రమంగా ఆటపై పట్టు కోల్పోతూ వచ్చింది. అయినా ఆ జట్టును తర్వాతి కాలంలో ముందుండి నడిపించిన లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. అలా వ్యక్తిగత ప్రదర్శనలతో ఆధారపడుతూ వచ్చిన వెస్టిండీస్‌ ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌కి క్వాలిఫై అవ్వలేని స్టేజీకి ఎందుకు వచ్చింది..?
నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి పసికూన జట్లపై క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన వెస్టిండీస్‌ వరల్డ్‌ కప్‌కి అర్హత సాధించే అవకాశాలను కోల్పోవడంతో వెటరన్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఆ జట్టుపై ఫైర్ అవుతున్నారు. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఓ అడుగు ముందుకేసి ‘వాటే షేమ్‌’ అంటూ ట్వీట్ పెట్టాడు. ప్రస్తుత వెస్టిండీస్‌ క్రికెటర్లు దేశం కోసం ఆడరన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఈ విమర్శల్లో ఎలాంటి హేతుబద్దత లేదు. ఎందుకంటే వెస్టిండీస్‌ క్రికెట్ పతనం అవ్వడానికి కారణం ఆ జట్టు ఆటగాళ్లు కాదు.. ఆ దేశ క్రికెట్ బోర్డు..! జీతాలు, చెల్లింపుల విషయంలో వెస్టిండీస్‌ బోర్డుతో క్రికెటర్ల గొడవ దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. డబ్బులు ఇవ్వకుండా దేశం కోసం ఆడమంటే ఎవరుమాత్రం ఆడతారు..? టీమిండియా క్రికెటర్లు ఏదైనా అనగలరు. ఎందుకంటే మనది ప్రపంచంలో ధనిక బోర్డు. ఆటగాళ్లని కంటికిరెప్పలా కాపాడుకునే బోర్డు. వెస్టిండీస్‌ బోర్డు అలా కాదు..!
ప్రపంచంలో ఏ మూల క్లబ్‌ క్రికెట్ జరుగుతున్నా వెస్టిండీస్‌ ఆటగాళ్లు వాలిపోతున్నారంటే, ఆ దేశ ఆటగాళ్ల కోసం ఐపీఎల్‌ లాంటి లీగ్‌లు కూడా ఎగబడతున్నాయంటే వాళ్లకి ఆడడం రాదని అర్థమా..? ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశం తరఫున ఆడుతూనే లీగ్‌ల్లో కూడా ఆడుతుంటారు కదా. కానీ వెస్టిండీస్‌ ప్లేయర్ల మాత్రమే అలా ఎందుకు లేరు..? ఎందుకంటే బోర్డుతో కలిసి పని చేయడం ఇష్టం లేదు కాబట్టి. చేసిన పనికి తగిన వేతనం ఇవ్వకపోతే ఆ సంస్థలో ఎవరూ ఉండాలని అనుకోరు. ఇక్కడ ఇంకొక విమర్శ ఉంది. క్లబ్ క్రికెట్ ఆడుతూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్న విండీస్‌ ఆటగాళ్లు దేశం కోసం ఆడలేరా అని..? ఇక్కడ సమస్య డబ్బుది కాదు.. గౌరవానికి సంబంధించింది. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్లు డబ్బులు తీసుకోకుండానే ఆడారా..?
నిజానికి వెస్టిండీస్‌ బోర్డుతో ప్లేయర్ల ఇష్యూ చాలా కాలంగా ఉంది. అందుకే వెస్టిండీస్‌ టీమ్‌ ఒక సిరీస్‌కి మరో సిరీస్‌కి మారిపోతూ ఉంటుంది. 2016లో మాత్రం టీ20 వరల్డ్ కప్‌ కోసం సీనియర్లంతా ఏకమయ్యారు. వెస్టిండీస్‌ని ఛాంపియన్‌ చేశారు. అయినా బోర్డు తీరులో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. బంగ్లాలు, విల్లాలు ఉన్నవాళ్లు దేశం కోసం ఆడాలంటూ బడాయి మాటలు చెబుతుంటారు కానీ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది కేవలం డబ్బు మాత్రమే. దేశం కోసమే ఆడాలన్నదే నిజమైతే.. టీమిండియాకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సెహ్వాగ్‌, ద్రవిడ్, ధోనీ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో తమ ఫ్రాంచైజీల తరఫున ఎందుకు ఆడారో. ఇంకా ఎందుకు ఆడుతున్నారో..! ఓకే లీవ్‌ ఇట్.. ప్రస్తుత వెస్టిండీస్‌ జట్టు మాత్రం వివియన్‌ రిచర్డ్స్‌, లారా లాంటి ఆటగాళ్లని తల ఎత్తుకోలేని విధంగా చేసింది. ఇది నిజమే..! ఎంతో ఘనమైన క్రికెట్ చరిత్ర ఉన్న వెస్టిండీస్‌ ఇప్పుడు ఇంతటి దారుణ స్థితిలో ఎందుకున్నది మాత్రం ఎవరికీ అనవసరం..!