హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, HCA మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. 2020 – 2023 మధ్య హెచ్‌సీఏలో దాదాపు 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్‌మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ అవినీతి కేసులో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. కాగా నోటీసులపై స్పందించేందుకు తనకు సమయం కావాలని అజారుద్దీన్ ఈడీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది.