బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు అంతా రెడీ అయింది. మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సిరీస్ తొలి టెస్ట్ నుంచీ హోరాహోరీగా సాగుతుండడమే ఈ క్రేజ్ కు కారణం. మొదటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే… అడిలైడ్ డే నైట్ టెస్టులో ఆసీస్ విజయం సాధించి స్కోర్ సమం చేసింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లూ . బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతను డిసైడ్ చేయబోతున్నాయి. గబ్బాలో టెయిలెండర్ల పోరాటంతో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కి ఓటమిని తప్పించుకున్న టీమిండియా మెల్ బోర్న్ లో గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే బ్యాటర్లు గాడిన పడితేనే విజయంపై ఆశలు పెట్టుకోగలం.
ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ కెఎల్ రాహుల్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. కోహ్లీ ఒక సెంచరీ చేసినా తర్వాత మళ్ళీ వైఫల్యాల బాటలోనే ఉన్నాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఫామ్ అందుకోవాల్సి ఉంది. నాలుగో టెస్టులో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్సుంది. దీంతో ఫామ్ లో ఉన్న రాహుల్ వన్ డౌన్ లో ఆడనున్నాడు. అటు వరుసగా నిరాశపరుస్తున్న గిల్ స్థానంలో ధృవ్ జురెల్, సర్ఫరార్ లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది. మరో స్పిన్నర్ గా జడేజానే కొనసాగనుండగా… పేస్ ఎటాక్ లో బుమ్రాకు సిరాజ్, ఆకాశ్ దీప్ నుంచి పూర్తి సపోర్ట్ రాకుంటే కష్టమే. బాక్సింగ్ డే టెస్ట్ రికార్డుల్లో భారత్ దే పైచేయిగా ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఫుల్ జోష్ లో ఉంది. మెల్ బోర్న్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఆతిథ్య జట్టు ఫైనల్ కాంబినేషన్ పై గట్టి కసరత్తే చేసింది. ఫామ్ లో ఉన్న హెడ్ తో పాటు కొత్తగా సామ్ కొంటాస్ ను తుది జట్టులోకి తీసుకుంది. బౌలింగ్ లో హ్యాజిల్ వుడ్ దూరమైనా.. స్టార్క్, కమ్మిన్స్, స్కాట్ బొలాండ్ నిలకడగా రాణిస్తున్నారు. మెల్ బోర్న్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండడంతో ఆసీస్ పేస్ ఎటాక్ ను ఫామ్ లో లేని మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు మిగిలిన రెండు టెస్టులూ కీలకంగా మారాయి.