ఆ స్టాండ్ కూలిపోతుందా ? కాన్పూర్ స్టేడియంపై ఫ్యాన్స్ ఆందోళన

కాన్పూర్ మైదానం బలహీనంగా ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 05:50 PM IST

కాన్పూర్ మైదానం బలహీనంగా ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులు నిండితే.. ఆ స్టాండ్ కూలిపోయే ప్రమాదముందని జాతీయ మీడియా తెలిపింది. ఈ కారణంగానే యూపీ క్రికెట్ అసోసియేషన్ ఆ స్టాండ్‌లో సగం టికెట్లు మాత్రమే విక్రయానికి పెట్టిందని భావిస్తున్నారు. కాన్పూర్ స్టేడియంలోని బాల్కానీ సీ స్టాండ్‌పై పీడబ్ల్యూడీ కొన్ని సమస్యలు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే మరమ్మతుల పనులు జరుగుతున్నాయని యూపీ క్రికెట్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు.

బాల్కనీ సీ పరిస్థితి దారుణంగా ఉందని, మ్యాచ్ జరిగే సమయంలో ఆ స్టాండ్ మూసివేయాలని ఇంజనీర్ల బృందం యూపీ క్రికెట్ అసోసియేషన్‌కు సూచించినట్లు సమాచారం.భారత బ్యాటర్లు ఆ వైపు సిక్స్ కొడితే.. అభిమానులు ఎగిరి గంతేస్తే స్టాండ్ కుప్పకూలుతుందని ఓ ఇంజనీర్ చెప్పినట్లు కూడా ఆ కథనంలో రాసుకొచ్చారు. దీంతో ఆ స్టాండ్ లో టికెట్లు కొనకపోవడమే మంచిదంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి కథనాలు వచ్చినా యూపీ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకూ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. కాగా ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశాలున్నాయి.