Sanju Samson: మొన్న ధోని.. నిన్న సంజూ.. రనౌట్‌తో మ్యాచ్ పోయే

అక్షర్‌ పటేల్‌ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్‌ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్‌ మేయర్స్‌.. నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 12:39 PM IST

Sanju Samson: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు.

దీనికి తోడు సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ‍మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్‌ రనౌట్‌ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మూడో బంతిని అక్షర్‌ పటేల్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అక్షర్‌ పటేల్‌ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్‌ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్‌ మేయర్స్‌.. నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్‌ రనౌట్‌ను ఎంఎస్‌ ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ధోని రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్‌తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది.

కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్‌ గప్టిల్‌ అద్బుతమైన డైరెక్ట్‌ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ”ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్‌ కెరీర్‌ కూడా ముగిసినట్లేనా”.. మీ లాజిక్‌లు తగలయ్యా.. బోలెడంత కెరీర్‌ ఉన్న శాంసన్‌ ఔట్‌ను ధోని రనౌట్‌తో పోల్చకండి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పేర్కొంటున్నారు విశ్లేషకులు.