Rohit Sharma: వరల్డ్ కప్ 2023 కోసం 15 మంది సభ్యులు గల భారత జట్టును బీసీసీఐ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటుదక్కగా.. శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్ వంటి అనుభవమున్న ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు.. అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది.
జట్టు ప్రకటన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఇదే బెస్ట్ టీమ్ అని చెప్పడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్‌లను పక్కన పెట్టడం సమంజసమే అయినా.. సంజూ శాంసన్, యుజువేంద్ర చహల్‌లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక లాభం లేదు.. ఇతర క్రికెటర్లలాగా మీరు కూడా విదేశాలకు తరలిపోండి అంటూ కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నారు. భారత జట్టు కూర్పుపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వరల్డ్ కప్‌లో సత్తా చాటితేనే భారత్ విజేతగా నిలుస్తుంది. సెలెక్టర్లు, కెప్టెన్ ఎంపిక సరైందే అని తెలుస్తుంది.