టీమిండియా కొత్త కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీ ట్వంటీ సిరీస్ లో సూర్యకుమార్, రింకూ సింగ్ , పరాగ్ లను బౌలింగ్ కు దింపిన గౌతీ తాజాగా వన్డే సిరీస్ లోనూ అదే ప్రయోగాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా పార్ట్ టైమ్ బౌలర్లను మళ్ళీ రెగ్యులర్ గా ఉపయోగించుకునేందుకు ట్రై చేస్తున్నాడు. శ్రీలంకతో రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయడమే దీనికి నిదర్శనం. దాదాపు ఏడాది తర్వాత బంతిని అందుకున్న రోహిత్ 11 పరుగులు ఇచ్చాడు. నిజానికి హిట్ మ్యాన్ పేరిట ఐపీఎల్ లో హ్యాట్రిక్ కూడా ఉంది.భుజానికి సర్జరీ అయినప్పటి నుంచి రోహిత్ బౌలింగ్ చేయడం లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు రోహిత్ చేత గంభీర్ బంతిని పట్టించాడు.
ఇటీవల టీ ట్వంటీ సిరీస్ లో పార్ట్ టైమ్ బౌలర్ల కారణంగానే భారత్ చివరి మ్యాచ్ గెలిచింది. చివరి 12 బంతుల్లో 9 పరుగులే చేయాల్సిన దశలో రెగ్యులర్ బౌలర్లు ఉన్నా పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్ , సూర్యకుమార్ ల చేత బౌలింగ్ చేయించాడు. వీరిద్దరూ స్లో బాల్స్ తో లంకను దెబ్బకొట్టడంతో సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు రోహిత్ ను కూడా ఇదే పద్ధతిలో తీసుకొచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జట్టులో ఉన్న బ్యాటర్లందరినీ పార్ట్ టైమ్ బౌలర్లుగా మార్చేస్తాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా గంభీర్ ఈ వ్యూహం ఫాలో అవుతున్నాడంటూ అంచనా వేస్తున్నారు.