Naveed ul Hasan: భారత ముస్లింల మద్దతు మాకే

ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఇండియన్ ముస్లిమ్స్ అండగా నిలుస్తారని ఆ జట్టు మాజీ క్రికెటర్ నవీద్ ఉల్ హసన్ అన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నవీద్ ఉల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 05:44 PM IST

‘భారత్‌లో ఏ మ్యాచ్ జరిగినా టీమిండియానే ఫేవరేట్‌గా ఉంటుంది. అయితే పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే మాత్రం భారత ముస్లింలు మా జట్టుకే మద్దతు ఇస్తారు. భారత్‌ను కాదని మాకు సపోర్ట్ చేస్తారు. గతంలో చాలా సార్లు భారత ముస్లింలు.. పాకిస్థాన్ జట్టుకు అండగా నిలిచారు. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు మా దేశ జెండాలతో హాజరయ్యారు. భారత్‌లో నేను రెండు సిరీస్‌ల్లో ఆడాను. అహ్మదాబాద్, హైదరాబాద్‌లో చాలా మంది భారత ముస్లింలు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు. భారత్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడిన అనుభవం కూడా నాకుంది.

హైదరాబాద్‌లో మాకు ఊహించని మద్దతు లభించింది. వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే జట్లలో పాకిస్థాన్ జట్టు చాలా బలంగా ఉంది. భారత్ అనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పాకిస్థాన్‌కు మద్దతు లభిస్తోంది.’అని నవీద్ ఉల్ హసన్ చెప్పుకొచ్చాడు. ఇదే పాడ్‌కాస్ట్‌లో 2005 భారత పర్యటనలో దూకుడుగా ఆడుతున్న సెహ్వాగ్‌ను మాటలతో రెచ్చగొట్టి ఔట్ చేశానని నవీద్ ఉల్ హసన్ గుర్తు చేసుకున్నాడు. ఈ పోడ్కాస్ట్ ని విన్న భారత్ అభిమానులు అసలు ఎవడ్రా మీరంతా అంటూ, పాక్ క్రికెటర్ చెవులకు పట్టిన తుప్పును కామెంట్స్ తో వదిలించే ప్రయత్నం చేసారు. ఇండియాలో జీవిస్తున్న హిందువైనా, ముస్లీమైనా, క్రిస్టియన్ అయినా కూడా.. టీమిండియాకు మాత్రమే జై కొడతారు తప్ప, మీలాంటి వాళ్లకు కాదని ఖరాఖండిగా బదులిస్తున్నారు.