పన్నెండేండ్ల క్రితం భారత్ వేదికగానే జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి రెండున్నర దశాబ్దాల తర్వాత ప్రపంచకప్‌ను దక్కించుకున్నది. ఫైనల్ మ్యాచ్‌ను అయితే కొన్ని చోట్లలో థియేటర్లు, ప్రత్యేకంగా హోటల్స్‌లో ప్రదర్శించారు. కానీ తాను మాత్రం వరల్డ్ కప్ మ్యాచ్‌లను టీవీలలో చూడొద్దని ప్రస్తుత సారథి రోహిత్ శర్మ అనుకున్నాడట. ఐసీసీ ఇటీవలే నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘మనందరకీ వన్డే వరల్డ్ కప్ చాలా మెమొరేబుల్. ఆ మెగా టోర్నీని నేను ఇంటి నుంచి చూశాను. అప్పుడు నాలో రెండు రకాల ఎమోషన్స్ ఉండేవి. ఒకటి.. నేను ఆ టోర్నీ ఆడేందుకు ఎంపిక కాలేదు. అప్పుడు నేను చాలా నిరాశపడ్డాను. వాస్తవానికి అప్పుడు నేను వరల్డ్ కప్‌కు ఎంపిక కానందుకు గాను ఆ మెగా టోర్నీని టీవీలో కూడా చూడొద్దని అనుకున్నాను. కానీ రెండో ఎమోషన్ ఇండియా.. క్వార్టర్స్ చేరాక భారత్ ఆట మరింత మెరుగుపడింది. దీంతో నేను ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూశాను..’ అని వ్యాఖ్యానించాడు. ‘2011లో ఆడకపోయినా నేను 2015, 2019 ప్రపంచకప్‌లలో భాగమయ్యాను.
సెమీఫైనల్ వరకూ మేం చాలా బాగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ చేరలేకపోయాం. కానీ ఈసారి మేం ఆడబోయేది స్వదేశంలో కావున ఈసారి ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. వరల్డ్ కప్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. అయినా ప్రపంచకప్ గెలవడం ఒక్కరోజో రెండు రోజులకో అయ్యే పనో కాదు. నెల, నెలన్నర పాటు నిలకడగా ఆడుతూ విజయాలు సాధించాలి. అప్పుడే ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది..’ అని చెప్పాడు.