అవకాశాలు కోసం ఎదురు చూసిన సంజూ శాంసన్.. ఇప్పుడు విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో సంజూ 12, 7 పరుగుల చొప్పున స్కోరు చేశాడు. అంతకుముందు మూడో వన్డేలో మాత్రం హాఫ్ సెంచరీతో అలరించాడు. కానీ, తనకు అచ్చొచ్చే పొట్టి ఫార్మాట్‌లో విఫలం కావడం గమనార్హం. ఇక మిగిలిన మూడు టీ20ల్లోనూ తుది జట్టులో అవకాశం లభించినా.. ఉత్తమ ప్రదర్శన చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కొనసాగితే అతడు మెగా టోర్నీలో ఆడాలనే కల సాకారం కావడం కష్టమేనని పేర్కొన్నారు.
‘‘భారత్ ఓడిపోయినప్పుడల్లా నెగిటివ్ పాయింట్లు గురించి వెతుకుతూ ఉంటాం. వన్డే, టీ20 సిరీసుల్లో ఎక్కువగా బ్యాటర్ల గురించే మాట్లాడతాం. వారు సరిగా ఆడటం లేదని విమర్శిస్తాం. ఇప్పుడు సంజూ శాంసన్ గురించి చర్చ మొదలైంది. అయితే, భారత్ ఓడిన ప్రతిసారీ సంజూ జట్టులో లేడనే విషయం గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో సంజూ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ విఫలం కావడం నిరుత్సాహానికి గురి చేసే అంశం. ఇటీవల సంజూకి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిని అందిపుచ్చుకోలేదు. అయితే, యువ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకొన్నాడు.
రెండు మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు’’ అని పార్థివ్ తెలిపాడు. సంజూ ఐపీఎల్‌లో వన్‌డౌన్ లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ భారత టాప్ ఆర్డర్‌లో ఖాళీ లేదు. వరల్డ్ కప్ ముగిశాకే ఆ స్థానంలో ఆడే అవకాశం సంజూకి రావచ్చు. రోహిత్ – గిల్ ఓపెనర్లు. విరాట్ కోహ్లీ మూడో స్థానం ఫిక్స్. శ్రేయస్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు ఫిట్‌నెస్ సాధించి వస్తే వారిదే నాలుగో స్థానం. వీరిద్దరిలో ఒకరు అందుబాటులో లేకపోతే బ్యాకప్ ఉండాల్సిన అవసరం ఉంది. దాని కోసం సంజూతోపాటు తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నాడు’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.