Lokesh Kumar: స్విగ్గీ కుర్రాడి స్వింగ్.. నెదర్లాండ్స్ కోసం నెట్ బౌలర్..

నెదర్లాండ్స్ జట్టు కూడా బెంగళూరులో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. నెట్ బౌలింగ్ చేసేందుకు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎంపిక కావడమే విశేషం. 2023 వన్డే ప్రపంచ కప్లో అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్న సమయంలో నెదర్లాండ్స్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 04:08 PM IST

Lokesh Kumar: క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. మరో రెండు వారాల్లో ప్రపంచకప్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రికెట్ జట్లు ప్రాక్టీసుల్లో మునిగిపోయాయి. వరల్డ్ కప్ వేటలో తలమునకలయ్యాయి. ఇందులో భాగంగానే నెదర్లాండ్స్ జట్టు కూడా బెంగళూరులో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. నెట్ బౌలింగ్ చేసేందుకు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎంపిక కావడమే విశేషం.

2023 వన్డే ప్రపంచ కప్లో అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్న సమయంలో నెదర్లాండ్స్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే కొంతమంది స్థానిక నెట్ బౌలర్లకోసం జట్టు ఓ ప్రకటన ఇచ్చింది. నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఇందులో బెంగళూరుకు చెందిన స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లోకేష్ కుమార్ కూడా ఎంపికయ్యాడు. వృత్తిరీత్యా స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా లోకేష్ పనిచేస్తున్నాడు. నెట్ బౌలర్‌గా ఎంపిక కావడంపై లోకేష్ స్పందిస్తూ.. “ఇది నా కెరీర్‌లో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి. నేను కనీసం టీఎన్ సీఎ థర్డ్ లీగ్‌లో కూడా ఆడలేదు. ఇది నాకు అరుదైన అవకాశం. మొదటి ట్రెయినింగ్‌ సెషన్‌ బాగా సాగింది. నెదర్లాండ్స్‌ జట్టు సభ్యులు మాకు స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు, మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని ప్రోత్సహించారు.

నెదర్లాండ్స్‌ జట్టులో సభ్యుడినయ్యా అని నేను ఫీల్ అవుతున్నా’’ అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బెంగళూరులో నెదర్లాండ్స్‌ ట్రెయినింగ్‌ క్యాంపు నిర్వహిస్తోంది. సెప్టెంబరు 29న పాకిస్తాన్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఈ ‘డచ్’ టీం ఆడనుంది. కాగా, లోకేష్ బంతులకు నెదర్లాండ్స్ ఆటగాళ్లకు కళ్ళు బైర్లు కమ్ముతుండడం ఇక్కడ కొసమెరుపుగా మారింది.