Gautam Gambhir: ముక్కుసూటిగా మాట్లాడటంలో టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ అందరికంటే ముందుంటాడు. టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్‌కి లైవ్‌లోనే కౌంటర్ ఇచ్చాడు. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. పాకిస్థాన్‌తో తలపడ్డ టీమిండియా 266 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇషాన్‌కిషన్ సత్తా చాటాడు. ఐదో నంబర్ పొజిషన్‌లో ఇషాన్ ఎలా ఆడుతాడో అని కంగారు పడ్డ అభిమానులకు తన టాలెంట్ ఏంటో చూపించాడు. 66 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యాతో కలిసి ఆదుకున్నాడు.. ఈ ఇద్దరు ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో రోహిత్ సేన మెరుగైన స్కోర్ సాధించింది. ఇషాన్ ఆటపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. టీమిండియా మాజీ ప్లేయర్, నాటి స్టార్ ఫీల్డర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు 2011 వరల్డ్ కప్ ఫైనల్ హీరో గౌతమ్ గంభీర్‌కి కోపం తెప్పించింది. గౌతమ్ గంభీర్, మహ్మద్ కైఫ్.. లైవ్ టీవీలోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు.
కేఎల్ రాహుల్ గాయం కారణంగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరం అవ్వడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్ పాక్‌పై 82 బంతుల్లో 81 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్ జట్టుకు ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. కేఎల్ రాహుల్‌కి వరుస పెట్టి గాయాలు అవుతుండటంతో పలువురు ఇషాన్‌నే వరల్డ్‌కప్‌కి కూడా తుది జట్టులో ఆడించాలని అభిప్రాయపడుతున్నారు. ఇక కైఫ్ మాత్రం రాహుల్‌నే ఆడించాలని చెప్పాడు. రాహుల్ నంబర్-5 పొజిషన్‌లో అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. రాహుల్ గాయం కారణంగా ఇషాన్‌కి నంబర్-5లో ఛాన్స్ వచ్చిందని.. కేఎల్ తిరిగి జట్టుతో కలిసిన తర్వాత ఇషాన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుందని చెప్పాడు.
కైఫ్ మాటలను పక్కనే ఉండి వింటున్న గంభీర్ ఈ స్టార్ ఫీల్డర్ వ్యాఖ్యలను వ్యతిరేకించాడు. ఇషాన్‌కి ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ అని గుర్తు చేశాడు. చివరి ఏడు వన్డేల్లో ఇషాన్ నాలుగు ఫిఫ్టిలు బాదిన విషయం మరువద్దన్నాడు గంభీర్. ప్రస్తుత ఫామ్ చూసి వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండాలి, కానీ పేరు చూసి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నాడు గంభీర్. ఇదే ఇషాన్ స్థానంలో కోహ్లీ, రోహిత్ ఉండి ఉంటే ఇలా మాట్లాడేవాడివా అని కైఫ్‌ని సూటిగా ప్రశ్నించాడు గంభీర్. వరల్డ్‌కప్ టైమ్‌కి ఎవరు బెస్ట్‌గా ఆడుతున్నారో వారే తుది జట్టులో ఉండాలని.. అంతేకానీ గతాన్ని చూసి అవకాశాలు ఇవ్వడం మంచిది కాదన్నాడు గంభీర్. మరోవైపు గంభీర్ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ అభిమానులు ఏకీభవిస్తుంటే.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అంగీకరించడంలేదు. కోహ్లీపై కోపాన్ని రాహుల్‌పై చూపిస్తున్నాడని కొందరు కామెంట్లు చేస్తుండగా.. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో టీమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని.. రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్ అని గుర్తుచేస్తున్నారు. గంభీర్ వ్యాఖ్యలు నిజాయితీగా ఉన్నాయంటున్నారు.