జింబాబ్వే టూర్ లో యువ భారత్ సత్తా చాటుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో టీ ట్వంటీ తుది జట్టు ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ పై అభిమానులు, విశ్లేషకులు ఫైర్ అవుతున్నారు. గిల్ సెల్ఫిష్ కెప్టెన్ అంటూ మండిపడుతున్నారు. దీనికి కారణం అభిషేక్ శర్మను వన్ డౌన్ లో ఆడించడమే. రెండో టీ ట్వంటీలో ఓపెనర్ గా ఆడిన అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అయితే మూడో టీ ట్వంటీలో మాత్రం జైశ్వాల్ రాకతో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికి పంపించారు. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మను ఓపెనర్‌గా కొనసాగించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో ఆడాల్సి వచ్చింది.
దీంతో గత మ్యాచ్ జోరును అతను కొనసాగించలేకపోయాడు. 10 పరుగులే చేసి ఔటయ్యాడు. అభిషేక్ శర్మను ఓపెనర్‌గా పంపించి ఉంటే.. పవర్ ప్లేలో ధాటిగా ఆడేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ డౌన్‌లో కంటే ఓపెనర్‌గానే అభిషేక్ శర్మ సత్తా చాటగలడని సూచిస్తున్నారు. కనీసం చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా అతన్ని ఓపెనర్‌గా ఆడించాలని కోరుతున్నారు. శుభ్‌మన్ గిల్‌ది సెల్ఫీష్ కెప్టెన్సీ అని, అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో భాగంగానే శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసినట్లు తెలుస్తోంది.