Umran Malik: అతన్ని తీసుకోండి.. టీమిండియా వకార్ యూనిస్ అవుతాడు

ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉమ్రాన్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 03:46 PM IST

Umran Malik: కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉమ్రాన్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.

అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్‌-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. అయినప్పటికీ వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్‌.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు. ఇదిలా ఉండగా, ఉమ్రాన్ మాలిక్‌ను సానపెడితే, టీమిండియాకు పాకిస్థాన్ లెజెండ్ వకార్ యూనిస్ వంటి స్థాయిని అందుకుంటాడని టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.