ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్… ఆ తర్వాత ఏడాది కూడా ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచింది. గత సీజన్ లో మాత్రం లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పలువురు కీలక ఆటగాళ్ళకు గుడ్ బై చెప్పబోతోంది. గుజరాత్ వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ జాబితాలో కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 2023 సీజన్ కు ముందు వేలంలో మూడో స్థానం కోసంఅతన్ని తీసుకున్నప్పటకీ… మ్యాచ్ ఆడుతూ గాయంతో దూరమయ్యాడు. పైగా నలుగురు విదేశీ ఆటగాళ్ళు ఫిక్స్ అయిపోవడంతో కేన్ మామకు ఛాన్స్ దొరికే పరిస్థితి లేదు. దీంతో అతన్ని వేలంలోకి వదిలేయాలని గుజరాత్ నిర్ణయించుకుంది. వచ్చే వేలంలోనూ విలియమ్సన్ కు బిడ్డింగ్ రావడం కష్టమేనని కూడా అంచనా వేస్తున్నారు.
అలాగే రాహుల్ తెవాటియాను కూడా గుజరాత్ రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే శుభ్ మన్ గిల్, సాయిసుదర్శన్, మహ్మద్ షమీలను రిటైన్ చేసుకోనుండడంతో మరో ఆప్షన్ లేదు. తెవాటియాను వేలంలోకి వదిలేసినా రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. ఫినిషర్ గా గత సీజన్ లో గొప్పగా రాణించకున్నా తెవాటియాపై గుజరాత్ ఫ్రాంచైజీ నమ్మకం కోల్పోలేదు. ఇక
పేస్ బౌలర్ మొహిత్ శర్మ కు కూడా గుజరాత్ గుడ్ బై చెప్పనుంది. 2022 సీజన్ లో నెట్ బౌలర్ గా అడుగుపెట్టి తర్వాత ప్రధాన పేసర్ గా గుజరాత్ జట్టులో ప్లేస్ దక్కించుకున్న మొహిత్ శర్మ ఈ ఏడాది అంతగా రాణించలేదు. 12 మ్యాచ్ లలో 13 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. దీంతో మొహిత్ ను వేలంలోకి రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.