ఆంధ్రా జట్టుకు క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై కొట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా అని అంటుంటే… నేను ఆంధ్రకు ఆడలేను అంటున్నాడు ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ప్లేయర్. తిరుపతికి చెందిన అధికారపార్టీ కార్పొరేటర్ తీరుతో ఇబ్బంది పడ్డాడు. క్రికెట్ లో రాజకీయ జోక్యం వల్లే తప్పుకుంటున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు విహారీ.
ఆంధ్రా రంజీ జట్టులో 17వ మెంబర్ గా ఉన్న కార్పొరేటర్ కొడుకుని… ఓ కెప్టెన్‌గా మందలించడమే విహారి చేసిన తప్పు. ఏడేళ్లుగా ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో బెంగాల్‌తో ఆంధ్రా జట్టు మొదటి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో 17th ప్లేయర్ కె.ఎన్.పృథ్వీరాజ్‌ను ఏదో కారణంతో కెప్టెన్ విహారి మందలించాడు. అంతే ఆ మొదటి మ్యాచ్ తర్వాత విహారిని కెప్టెన్సీ నుంచి పీకేశారు. రికీభుయ్‌కు అప్పగించారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు ఓడిపోయింది. ఇక మనసులోని ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్ లో బయటపెట్టాడు హనుమ విహారీ. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయాననీ… తీవ్రంగా అవమానించారని పోస్ట్ పెట్టాడు.
బెంగాల్ తో ఆంధ్రకు జరిగిన ఫస్ట్ మ్యాచ్ కి హనుమ విహారి కెప్టెన్. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన జట్టు బెంగాల్. ఆ జట్టు 410 రన్స్ టార్గెట్ పెట్టగా… పోరాడి గెలిచాం. కానీ కెప్టెన్సీకి రిజైన్ చేయాలని ఏసీఏ తనను ఆదేశించినట్టు విహారీ తెలిపాడు. కేవలం వైసీపీ లీడర్ ఒత్తిడితో కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ లీడర్ కొడుకుని తానేమీ అనలేదని అంటున్నాడు విహారీ. ఆంధ్ర రంజీ జట్టుకు ఏడేళ్లుగా కెప్టెన్‌గా ఉండి….. ఐదు సీజన్లలో జట్టును నాకౌట్ దాకా తీసుకొచ్చా. దేశం తరపున 16 టెస్ట్‌లు ఆడిన క్రికెటర్ కంటే జట్టులో సభ్యుడే ఎక్కువయ్యాడా… అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విహారి ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తీసేయడం ఇబ్బందిగా అనిపించినా.. ఆటపై, జట్టుపై గౌరవంతో ఇన్నాళ్లూ కొనసాగానని తెలిపాడు హనుమ విహారీ.
మొదటి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బలవంతంగా తొలగించినా… వ్యక్తిగత కారణాలతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో చెప్పాడు విహారి. ఈ సీజన్‌లో ఆంధ్రా జట్టు రంజీ నుంచి ఔట్ అవడంతో… అసలు సంగతి బయటపెట్టాడు. ఈ సీజన్‌లో విహారి 13 ఇన్నింగ్స్‌లో 522 పరుగులు చేశారు. జట్టులో రికీభుయ్ తర్వాత సెకండ్ హయ్యస్ట్ రన్స్ చేసింది విహారీనే. ఆంధ్రా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారుల్లో విహారి ఒకరు. భారత్ తరఫున ఆయన 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 839 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై సెంచరీ కొట్టారు. హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించాక…కె.ఎన్.పృథ్వీరాజ్ తప్ప జట్టులోని మిగతా 15 మంది కూడా ACA పెద్దలకు లెటర్ రాశారు. విహారి తప్పేమీ లేదనీ… ఆయన్నే కెప్టెన్‌గా కంటిన్యూ చేయాలని కోరారు. విహారి తర్వాత కెప్టెన్ అయిన రికీభుయ్ కూడా సపోర్ట్ చేశాడు. విహారీ ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడలేదనీ… ఎవరినీ కొట్టడానికి వెళ్ళలేదన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే జనరల్ డిస్కషన్ ను పృథ్వీరాజ్ వ్యక్తిగతంగా తీసుకున్నాడని ఆ లెటర్ లో తెలిపారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాత్రం… విహారీపై విచారణకు సిద్ధమైంది. విహారీ అసభ్యంగా మాట్లాడాడనీ… జట్టు సభ్యులు, ఏసీఏ పాలకుల నుంచి ఫిర్యాదు వచ్చిందని అంటోంది. విహారి జాతీయ క్రికెట్ జట్టుకు పరిశీలనలో ఉన్నందున … రంజీ సీజన్ అంతా అందుబాటులో ఉండడు. ఆయన బదులుగా మరొకర్ని కెప్టెన్‌గా నియమించాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి మెయిల్ రావడం వల్లే కెప్టెన్‌గా తొలగించినట్టు ఏసీఏ చెబుతోంది. కానీ వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఏసీఏ నడుస్తోందనీ… హనుమ విహారీ లాంటి ఆటగాడిని ACA అవమానించడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు X లో ట్వీట్ చేశారు.