Harbhajan Singh: ఈ పదకొండు మంది చాలు బజ్జీ ప్రెడిక్షన్ సరైందేనా?

దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 06:00 PM IST

కరేబియన్‌ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నారు. ముందుగా టెస్ట్ సిరీస్ ఆరంభం కానుండగా.. తొలి టెస్ట్ బుధవారం మొదలవునుంది. ఈ టెస్టు మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో ఎవరికి చోటివ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలనే విషయం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంపై భారత మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ పలు సూచనలు చేశాడు. హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలి. యశస్వి జైస్వాల్‌ను మూడో స్థానంలో ఆడించాలి.

అయితే చాలా మంది యశస్వితో ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ గిల్ ఓపెనర్‌గా తన స్థానం పదిలం చేసుకున్నాడు కాబట్టి అతడి స్థానాన్ని మార్చడం సరికాదు. యశస్వికి మంచి అవకాశం దక్కితే భారీ స్కోర్లు చేస్తాడని నేను భావిస్తున్నా’ అని అన్నాడు. ‘నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో అజింక్య రహానే ఆడతారు. ఆరో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. ఏడో స్థానంలో కేఎస్ భరత్ లేదా ఆర్ అశ్విన్ ఆడతారు. ఒకవేళ అశ్విన్‌ ముందుగా వస్తే.. భరత్ 8వ స్థానంలో ఆడతాడు. మహమ్మద్ సిరాజ్ 9వ స్థానంలో వస్తాడు. దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన జయదేవ్ ఉనద్కత్‌కు తొలి టెస్ట్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలి. చివరి స్థానంలో ముఖేష్ కుమార్‌ను తీసుకోవాలి’ అని హర్భజన్ సింగ్ సూచించాడు.