వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు వ్యక్తిగత జీవితంలో మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. భార్య నటాషాతో విడిపోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మరింత బలపరిచేలా నటాషా సెర్బియాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ముంబై ఎయిర్ పోర్టులో కొడుకుతో కలిసి ఆమె లోపలకి వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నటాషా కూడా తన ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. లగేజీతో కూడిన ఫొటోకు ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ కన్నీళ్లతో కూడిన ఎమోజీ, విమానం, ఇల్లు, హార్ట్ సింబల్ ఎమోజీని షేర్ చేసింది.
హార్థిక్ , నటాషా మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్ స్టాలో హార్థిక్ ను నటాషా అన్ ఫాలో చేయడం, వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు తొలగించడంతో పాటు ఇటీవల వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా విష్ చేయలేదు. దీంతో ఈ జోడీ విడిపోవడం ఖాయమైందనే భావిస్తున్నారు. తాజాగా భార్యతో విడాకులు తీసుకోవడం కోసమే హార్దిక్ శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా వన్డే సిరీస్ కంటే ముందే జరిగే టీ20 సిరీస్లో మాత్రం హార్దిక్ ఆడే అవకాశాలున్నాయి.