Wasim Akram: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు.. రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.
ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్‌లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు వసీం అక్రమ్.