Pandya: నువ్వేం లీడర్‌ సామీ.. తెలుగోడికి రావాల్సిన క్రెడిట్లు కొట్టేశావ్..పాండ్యాపై ఫ్యాన్స్‌ ఫైర్!

 క్రెడిట్లు కొట్టేయడం చాలా మంది లీడర్లకు అలవాటు.. ఇండియాలో ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. వెస్టిండీస్‌ టూర్‌లో టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా కూడా ఈ లిస్టులో చేరిపోయాడు!

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 11:16 AM IST

తెలుగు తేజం తిలక్‌ వర్మకి రావాల్సిన క్రెడిట్లు కొట్టేశాడు హార్దిక్‌ పాండ్యా. విన్నింగ్‌ షాట్ సిక్స్‌ కొట్టి తిలక్‌ని 50పరుగులు చెయ్యనివ్వకుండా ఆపేశాడు. తిలక్‌ 49పరుగులతో అజేయంగా నిలిచిపోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌పై టీ20ల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యా ఇలా చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓ సారధిగా ఉన్న పాండ్యా తన స్వార్థం చూసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు కూడా. 49పరుగులు చేసినవాడు 50పరుగులు చేయడానికి అర్హుడు. ఈ విషయం పాండ్యాకి తెలియదా.. ఇదేమైనా పాయింట్ల కోసం ఆడుతున్న సిరీసా? పాయింట్లు లేవు.. కేవలం మ్యాచ్‌ గెలవడం, ఓడడంపైనే సిరీస్‌ విజేత ఎవరో తెలుస్తుంది. 14బంతుల్లో 2పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో సిక్స్‌ కొట్టడం ఏంటి? మరో బంతి పడితే ఓవర్‌ కూడా ముగుస్తుంది కదా..! తిలక్‌ని మరో పరుగు చేసుకోనిస్తే పోయేదేముంది?

ఈ ఏడాది ఐపీఎల్‌లో అందరి మనసులను గెలుచుకున్న ఘటన ఒకటుంది. ముంబై ఆటగాడు గ్రీన్‌ సెంచరీకి దగ్గరైన సమయంలో.. అప్పటికే మ్యాచ్‌ ముంబై చేతిలోకి వచ్చేసిన టైమ్‌లో అవతలి ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ నడుచుకున్న తీరు యావత్‌ క్రికెట్‌ అభిమానుల నుంచి ప్రశంసలు వచ్చేలా చేసింది. గ్రీన్‌ సెంచరీ కోసం డాట్‌ బాల్స్ ఆడుతూ ఐపీఎల్‌లో ఈ ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌ మొదటి సెంచరీ కోసం సూర్య తనవంతు సాయం చేశాడు. నిజానికి ముంబై డగౌట్ కూడా అదే కోరుకుంది. ఐపీఎల్‌లో విజయంతో పాటు పాయింట్లు కూడా అవసరమున్నా ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. గ్రీన్‌ కూడా సెంచరీ చేసి మ్యాచ్‌ని ముగించాడు. కానీ అందరూ అలానే ఉండరు కదా.!

నిజానికి 199 పరుగులు చేసినోడు 200పరుగులు చేయడానికి 100శాతం అర్హుడు.. 98 పరుగులు చేసినోడు 100 పరుగులు చేయడానికి అన్ని విధాలా అర్హుడు. 2010లో తొలిసారి వన్డేల్లో డబుల్ సెంచరీ ల్యాండ్‌మార్క్‌ నమోదైంది. సచిన్‌ ఈ డబుల్ సెంచరీ బాదగా.. ఆ టైమ్‌లో అవతలి ఎండ్‌లో ఉన్న ధోనీపై అప్పట్లో అనేక విమర్శలొచ్చాయి. చివరి ఐదు ఓవర్లలో సచిన్‌ కేవలం 5బంతులే ఆడడం దీనిక కారణం.. అసలు స్ట్రైకింగే ఇవ్వకుండా సచిన్‌ 195పరుగులు దాటిన తర్వాత కూడా ధోనీ హిట్టింగ్‌ చేసుకుంటూ పోయాడు. 2016లో మనీశ్‌పాండే 98పరుగులు వద్ద ఉన్నప్పుడు కూడా ధోనీ ఇలానే చేశాడు. ఇక వన్డేల్లో రోహిత్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రాబిన్‌ ఉతప్ప బాల్‌ టు బాల్‌ సింగిల్‌ మాత్రమే తీస్తూ రోహిత్‌కి ఎక్కువగా స్ట్రైక్‌ ఇస్తూ ప్రపంచ రికార్డుకు పరోక్షంగా కారణమయ్యాడు. అప్పుడు ఉతప్ప నిస్వార్థంపై అనేక ప్రశంసలు వచ్చాయి. ఇలా ఒక్కొరిది ఒక్కొ తీరు. ఆటగాళ్లు ఎలా ఉన్నా.. కెప్టెన్లు మాత్రం ప్లేయర్లకు సపోర్ట్‌గా ఉండాలి. పాండ్యా ఈ సిరీస్‌లో ఈ ఒక్క విషయంలోనే కాకుండా మిగిలిన విషయాల్లోనూ స్వార్థంగా నడిచాడన్న ఆరోపణలున్నాయి. కేవలం గుజరాత్‌ లాబీతోనే ఎక్కువ కాలంలో కెప్టెన్‌గా ఉండలేమన్న విషయాన్ని పాండ్యా గుర్తుపెట్టుకోవాలి!