Harry Brook: ఈ ఓపెనర్ ఊచకోతకు ఇదే సమయం.. ఈసారి తానేంటో చూపిస్తా అంటున్న స్టార్ క్రికెటర్

సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన అత్యుత్తమ ఎంపికగా, టోర్నీకి ముందు మంచి హైప్ తెచ్చుకున్నాడు బ్రూక్. కానీ, ఐపీఎల్‌లో ఆడిన మూడు వరుస ఇన్నింగ్సుల్లో 13, 3, 13 పరుగులతో ఇంకా తడబడుతూనే ఉన్నాడు. దూకుడే మంత్రంగా చెలరేగే ఈ యంగ్ క్రికెటర్, ఎందుకో ఇండియన్ పిచ్‌ల మీద నెమ్మదించాడు.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 03:57 PM IST

Harry Brook: ఐపీఎల్-2023కి సంబంధించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో హ్యారీ బ్రూక్ ఒకడు. ఈ ఇంగ్లీష్ ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌కు ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మీద జరిగిన టోర్నీల్లో దుమ్ముదులిపిన హ్యారీ బ్రూక్.. ఐపీఎల్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ఇంకా ఆడలేదు.

ఇప్పటికీ టోర్నీలో సరిగ్గా కుదురుకోవట్లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన అత్యుత్తమ ఎంపికగా, టోర్నీకి ముందు మంచి హైప్ తెచ్చుకున్నాడు బ్రూక్. కానీ, ఐపీఎల్‌లో ఆడిన మూడు వరుస ఇన్నింగ్సుల్లో 13, 3, 13 పరుగులతో ఇంకా తడబడుతూనే ఉన్నాడు. దూకుడే మంత్రంగా చెలరేగే ఈ యంగ్ క్రికెటర్, ఎందుకో ఇండియన్ పిచ్‌ల మీద నెమ్మదించాడు. మరి కేకేఆర్‌తో నేడు జరిగే మ్యాచులో బ్రూక్ ఉంటాడా.. లేదా హెన్రిక్ క్లాసేన్‌ను రీప్లేస్ చేస్తారో చూడాలి. ఒకవేళ బ్రూక్ మీద నమ్మకం ఉంచి, జట్టులో కొనసాగిస్తే మాత్రం బ్రూక్‌కి ఇదే చివరి అవకాశంగా భావించాలి. అదో రకమైన హిట్టింగ్‌ చేస్తాడనే పేరున్న హ్యారీ బ్రూక్.. ఇప్పటివరకు మూడు ఇనింగ్సుల్లో కలిపి ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.

ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్న ఒత్తిడి వల్లనో, లేదా ఇండియన్ పిచ్‌ల మీద ఆడిన అనుభవం లేకపోవడమో కానీ బ్రూక్ విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో అతడి మీద సన్ రైజర్స్ అభిమానులు గుర్రుగానే ఉన్నారు. స్పిన్‌ బౌలింగ్‌లో తడబాటుకు గురవుతున్న హ్యారీ.. సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్ మెజీషియన్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఒక్కడు సెట్ అయితే, ఆరెంజ్ ఆర్మీ గుండెల మీద చెయ్యేసుకుని మ్యాచ్‌పై భరోసాతో ఉండొచ్చు. కోల్‌కతాతో మ్యాచ్ బ్రూక్‍కి కలిసొస్తుందా.. లేదా అనేది శుక్రవారం సాయంత్రం జరగబోయే మ్యాచుతో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కోసం టీ 20 లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.