టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అదరగొట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపాడు. వరల్డ్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు బెస్ట్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ ట్వంటీ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు. వరల్డ్ కప్ లో పాండ్యా 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగై శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగతో కలిసి టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో మరో భారత ప్లేయర్ కు చోటు దక్కలేదు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ ఏడు స్థానాలు మెరుగై 12వ ర్యాంకులో నిలిచాడు.
అటు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ టాప్ ప్లేస్ లో ఉండగా… సౌతాఫ్రికా పేసర్ నోర్జే ఏడు స్థానాలు మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఉండగా.. వరల్డ్ కప్ లో 17 వికెట్లు పడగొట్టిన బూమ్రా ఏకంగా 12 స్థానాలు మెరుగై 12వ ర్యాంకులో నిలిచాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ట్రావిడ్ హెడ్ టాప్ ప్లేస్ లో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.