Arjuna Ranatunga: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దాదాపు 20 నెలల తర్వాత వన్డే క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అనూహ్యంగా అశ్విన్‌కు చోటు దక్కింది. దీంతో అతడు భారత వరల్డ్‌కప్ ప్రణాళికలలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రపంచకప్‌కు తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్ ప్రిలిమనరీ జట్టులో అశ్విన్ లేడు.
కానీ ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్ మెరుగ్గా రాణిస్తే కచ్చితంగా ప్రధాన టోర్నీలో ఆడుతాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అశ్విన్ మ్యాచ్ విన్నర్ అని రణతుంగ కొనియాడాడు. అదే విధంగా ఆసీస్ సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని రుణతుంగ తెలిపాడు. “భారత జట్టు మేనెజ్‌మెంట్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్-రౌండర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ నావరకు అయితే.. రవి అశ్విన్ వంటి స్పిన్నర్‌కు ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కకపోయినా జట్టులో మాత్రం ఉండాలి. టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ ఆడినా చాలు.. జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తాడు.
అతడు ఫీల్డ్‌లో అంత యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ ఉపఖండ పిచ్‌లపై అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి అతడికి కచ్చితంగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వాలి” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణతుంగ పేర్కొన్నాడు.