Gaikwad : గైక్వాడ్ కు సాయం చేయండి.. తమ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమన్న కపిల్ దేవ్

భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.

 

 

భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించాడు. బీసీసీఐ అన్షుమన్‌ గైక్వాడ్‌కు ఆర్థికంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు.

ఇప్పటికే తనతో పాటు మొహిందర్‌ అమర్‌నాథ్‌, సునిల్‌ గావస్కర్‌, సందీప్‌ పాటిల్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, మదన్‌ లాల్‌, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్‌ వంటి అప్పటి తరం ఆటగాళ్ళు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు. అన్షుతో కలిసి క్రికెట్‌ ఆడిన తనకు.. అతడి ప్రస్తుత పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు.

71 ఏళ్ల అన్షుమన్‌ గైక్వాడ్‌ 1975 నుంచి 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్‌ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇదిలా ఉంటే బీసీసీఐకి కపిల్ కీలక సూచన చేశాడు. పాతతరం క్రికెటర్లకు కష్టకాలంలో చేయూతనిచ్చే విధంగా బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అప్పటి రోజుల్లో బోర్డు దగ్గర నిధులు పెద్దగా ఉండేవి కాదని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నాడు. అయితే సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని, బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదన్నాడు. కావాలంటే తాము కూడా పెన్షన్ నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు అందజేస్తామన్నాడు. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.