Asian Games 2023: నాలుగేండ్లకోసారి జరిగే ఏసియన్ గేమ్స్ మరో ఐదు రోజుల్లో మొదలుకానున్నాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు ఈనెల 23 నుంచి ఆరంభమవుతాయి. అక్టోబర్ 08 వరకు, పదిహేనురోజుల పాటు సాగే ఈ మెగా ఈవెంట్‌లో తలపడేందుకు 45 దేశాల ఆటగాళ్లు ఇదివరకే హాంగ్జౌలోని ‘స్పోర్ట్స్ విలేజ్’కు చేరుకున్నారు. 2018లో జకార్తాలో ముగిసిన ఆసియా గేమ్స్ తర్వాత 2022లోనే చైనాలో ఇవి జరగాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా అప్పుడు వాయిదాపడ్డాయి.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ కూడా ఇదే. సుమారు 5,050 మంది పాల్గొంటున్న ఈ క్రీడలలో దాదాపు 40 క్రీడాంశాలున్నాయి. హాంగ్జౌతో పాటు మరో ఐదు నగరాలలోని 56 వేదికలలో ఈ క్రీడలు జరుగనున్నాయి. అధికారికంగా ఏసియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్‌బాల్ వంటి పోటీలు ఈనెల 19 నుంచే మొదలుకానున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పతకాలను కొల్లగొట్టేందుకుగాను భారత్ భారీ బృందంతో బరిలోకి దిగుతోంది. దాదాపు 40 క్రీడాంశాలలో భారత్ నుంచి 655 మంది సభ్యులతో కూడిన క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. భారత్ నుంచి క్రికెట్ జట్టుకు ఇవే తొలి ఆసియా క్రీడలు. మహిళల క్రికెట్‌లో ఈనెల 21న, పురుషుల క్రికెట్‌లో 25న తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది భారత్.
అయితే, భారత్ కచ్చితంగా జావెలిన్ త్రో గేమ్‌తోపాటు బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, ఆర్చరీ వంటి ఈవెంట్లలో భారత్ కచ్చితంగా పతకాలు సాధించే అవకాశముంది. 2018లో జకార్తా వేదికగా ముగిసిన 18వ ఆసియా క్రీడలలో భారత్ 570 మంది అథ్లెట్లను పంపగా 70 పతకాలు సాధింది. ఇందులో 16 గోల్డ్ మెడల్స్, 23 రజతాలు, 31 కాంస్యాలు నెగ్గింది. ఈసారి కూడా భారత్ పతకాల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది.