Ravichandran Ashwin: వన్డే ప్రపంచకప్ కోసం తుది జట్టును ఖరారు చేయాల్సిన గడువు గురువారమే. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అయితే, ఇప్పుండదరి మదిలో ఉన్న ఏకైక ప్రశ్న.. గత రెండు వన్డేల్లో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా..? లేదా..? దీనికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఇంకా గాయం నుంచి కోలుకోని విషయం తెలిసిందే.
‘అశ్విన్ క్లాస్ బౌలర్. ఒత్తిడిని ఎలా అధిగమించాలో బాగా తెలుసు. చాన్నాళ్ల నుంచి భారత క్రికెట్ ఆడుతున్నాడు. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. ఆసీస్‌తో గత రెండు వన్డేలు మినహా గతేడాదిన్నర నుంచి అంతర్జాతీయంగా 50 ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయినా సరే అతడి అనుభవం, సీనియారిటీని పక్కన పెట్టలేం. గత రెండు మ్యాచుల్లో ఆసీస్‌పై ఎలాంటి ప్రదర్శన చేశాడనేది మనందరికీ తెలుసు. అతడి బౌలింగ్‌లో ఎన్నో వేరియషన్లు చూపిస్తాడు. అవకాశం ఉంటే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అయితే, కచ్చితమైన నిర్ణయం ఇప్పుడే చెప్పలేం. బ్యాకప్‌గా చాలా మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వారికి తగినంత మ్యాచ్‌లు ఆడే సమయం కూడా ఇచ్చాం. గత పది వన్డేల్లో భారత ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. కీలకమైన సమయంలో ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు.
బౌలర్లూ వికెట్లు తీస్తూ తమ సత్తా ఏంటో నిరూపించారు. గాయాల నుంచి కోలుకుని అద్భుత ప్రదర్శన ఇచ్చినవారూ ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ అంతా బాగుంది. తప్పకుండా వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఇక ఆసీస్‌పై క్లీన్‌స్వీప్ చేసే అవకాశం గురించి పెద్దగా ఆలోచించలేదు. కెప్టెన్‌గా అవన్నీ పట్టించుకోను. నాణ్యమైన క్రికెట్ ఆడి జట్టును గెలిపించడమే మా లక్ష్యం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.